Telangana Budget 2025: రూ.3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఈ శాఖలకు భారీగా నిధులు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
ఈసారి రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు.
గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి అది రూ.3 లక్షల కోట్లు దాటే అవకాశముంది.
ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత, లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో మూడు నెలల కాలానికి ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
Details
ఆరు గ్యారంటీల అమలుకు పెద్దఎత్తున నిధులు
అనంతరం 2024 జులై 25న మిగిలిన తొమ్మిది నెలల కోసం రూ.2.90 లక్షల కోట్లతో పూర్తి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఇప్పుడు, మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం సమర్పించనుంది.
ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు పెద్దఎత్తున నిధులు కేటాయించే అవకాశముంది.
వ్యవసాయం, నీటిపారుదల, విద్య, రోడ్లు-భవనాలు, ఇంధన శాఖ, గృహనిర్మాణం వంటి రంగాలకు అధికంగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.
వివిధ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు వ్యవసాయ శాఖకు అధికంగా నిధులు కేటాయించే అవకాశముంది.
Details
విద్యాశాఖకు భారీగా నిధులు
రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖకు నిధులు కేటాయించనున్నారు.
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు ఇంధన శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలల కోసం విద్యాశాఖకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు, మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.