
Telangana: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. స్థానిక ఎన్నికల్లో చారిత్రక ముందడుగు..చట్టసవరణకు క్యాబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలిచినట్టు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను పెద్ద ఎత్తున అమలు చేసే ఘనతను కూడా అందుకోబోతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వెనుక చాలా కసరత్తే జరిగింది. జనాభా ప్రాతిపదికన వెనుకబడిన వర్గాలకు సముచిత హక్కులు ఇవ్వాలన్న రాహుల్ గాంధీ సూచన, భారత్ జోడో యాత్రలో వచ్చిన డిమాండ్‌కి నెరవేరే దిశగా ఇది పెద్ద అడుగుగా నిలిచింది.
వివరాలు
కేబినెట్ 19వ సమావేశంలో 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి..
గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ 19వ సమావేశంలో 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ఈ చర్యను ఒక సామాజిక విప్లవానికి నాంది అని పేర్కొంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడంతో, కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రజల్లోకి వెళ్తూ మద్దతు కూడగట్టే పనిలో పడింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇదే దిశగా ఆలోచించాలని పిలుపునిస్తుంది. ఈ నిర్ణయం ఉద్భవించిన విధానం తేలికైనది కాదు. తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని ఇటీవల ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, రిజర్వేషన్లపై ఒక నెలలో తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఎదుట నిలిచింది.
వివరాలు
బీసీ జనాభా శాతం అనుగుణంగా 42 శాతం కోటా
ప్రతిపక్షాలు ఎన్నికలను ఒక రిఫరెండమ్‌గా మార్చాలన్న విధంగా విమర్శలు చేయడంతో, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది. ఇంతకు ముందు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన కులగణన ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. బీసీ జనాభా శాతం స్పష్టంగా తెలిసి, దానికి అనుగుణంగా కోటాను 42 శాతంగా ఖరారు చేసి, అసెంబ్లీలో తీర్మానంగా ఆమోదించబడినప్పటికీ, కేంద్రం ఆమోదం అవసరమన్న కారణంతో అమలు అంశం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలించింది: కేంద్రం నుంచి రాష్ట్రపతి ఆమోదం పొందడం, రాష్ట్రం స్వయంగా జీవో జారీ చేయడం, లేక పార్టీ తరఫునే బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వడం. చివరికి రెండవ మార్గానికే క్యాబినెట్ మొగ్గు చూపింది.
వివరాలు
రాష్ట్రంలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు
హైకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించి, జీవో తీసుకురావడమే ప్రభుత్వ ప్రణాళికగా మారింది. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే రాష్ట్రం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్నికల సరళిలో సర్పంచ్, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్‌గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లాను, జెడ్‌పీ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలయితే, మొత్తం కోటాలు 70 శాతానికి చేరతాయి. ఇది దేశ స్థాయిలో అభूतపూర్వమైన పరిణామంగా చెప్పవచ్చు.