Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీని మూడు విడతలలో పూర్తి చేసింది. దాదాపు రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. టెక్నికల్ సమస్యల కారణంగా ఇంకా కొన్ని అర్హత కలిగిన రైతులకు ఈ రుణమాఫీ సాయం అందలేదు. అలాంటి రైతులకు కూడా మాఫీ రాశిని అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. రైతు రుణమాఫీ అమలవ్వడంతో, అన్నదాతలు రైతు భరోసా పథకానికి ఎదురు చూస్తున్నారు.
వానాకాలం పెట్టుబడిగా ఎకరాకు రూ.7,500 రైతుల ఖాతాల్లో జమ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలలో రైతు భరోసా పథకం కూడా ఉంది.ఈ పథకం ద్వారా పంట పెట్టుబడికి ఎకరాకు రూ.15వేలు అందిస్తామని ప్రకటించారు. ఖరీఫ్,రబీ సీజన్లలో మొత్తం రూ.15వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతు భరోసా పథకం అమలుకు దసరా (అక్టోబర్ 12)నుండి పెట్టుబడినిధులు అందించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు. ఎకరాకు రూ.7,500 చొప్పున కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల తొలివారంలో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని యోచిస్తోంది. వానాకాలం పెట్టుబడిగా ఎకరాకు రూ.7,500 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.
సాగులో లేని భూములకు కూడా రైతుబంధు
గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.10 వేలు రెండు విడతలలో అందించిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు అందించారని ఆరోపణలు ఉన్నాయి. ఈసారి, సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం స్పష్టంగా చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలపై రైతు భరోసా ఇవ్వబడదని, కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పథకం అమలు చేయబోతున్నట్లు తెలిపారు.
రూ.10 వేల కోట్లు అవసరం
ఈ సమయంలో, రైతు భరోసా కోసం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, ఈ వానాకాలంలో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. రైతు భరోసా కోసం ఎకరాకు రూ.7,500 చొప్పున మొత్తం సాగైన భూములకు డబ్బులు అందిస్తే దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.