బీజేపీకి మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా; కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి ఎదురుగాలి వీస్తోంది. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించారు. పార్టీలో పనిచేసే వారిని సరైన రీతిలో ప్రోత్సహించట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో త్వరలోనే ఆయన హస్తం గూటికి వెళ్లనున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసినే మాజీ మంత్రి గతంలో టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో పనిచేశారు. మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బీజేపీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం: చంద్రశేఖర్
గత కొద్ది కాలంగా బీజేపీ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన చంద్రశేఖర్ బీజేపీకి ఝలక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఈ మాజీ మంత్రి ఓటమి చవిఛూశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ తరఫున బరిలోకి దిగినా మరోసారి నిరాశే ఎదురైంది. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేది కాంగ్రెస్ మాత్రమేనని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు.