YS Sharmila :కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న వైఎస్ షర్మిల.. పార్టీ విలీనానికి ముహూర్తం ఫిక్స్..?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే తన లక్ష్యమంటూ వైఎస్ షర్మిల పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.
వైఎస్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావటమే తన ప్రధాన ధ్యేయమంటూ వైఎస్ఆర్‌టీపీ పేరుతో ఆమె ఒక కొత్త పార్టీని స్థాపించారు.
మొదట్లో బీఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలతో విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల పార్టీ ప్రస్థానం ఇక ముగియనుంది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడానికి నేడు షర్మిల దిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
ఈ ప్రక్రియ కోసం మొదట బెంగళూరుకు వెళ్లిన షర్మిల అక్కడి నుంచే దిల్లీకి చేరుకున్నట్లు తెలిసింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Details
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్న షర్మిల..?
దిల్లీకి చేరుకున్న షర్మిల నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీంతో పాటు, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసే అవకాశముంది.
పార్టీ విలీనం తర్వాత షర్మిల ఏపీ కాంగ్రెస్ లేదా తెలంగాణ కాంగ్రెస్ కోసం పనిచేస్తారా? అనే విషయంపై ప్రస్తుతం ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పీసీసీ గిడుగు రుద్రరాజు కూడా ఏపీ నుంచి దిల్లీకి బయల్దేరడం గమనార్హం.
2021 జులై 8న యువజన శ్రామికరైతు తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల, మొదట తెలంగాణలోని అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది.
అయితే షర్మిల ఒక్కసారి కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో పొలిటికల్ స్పేస్ లేదని భావించిన షర్మిల, కాంగ్రెస్ లో వైఎస్ఆర్‌టీపీని విలీనం చేసేందుకు సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.