Page Loader
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్‌ ఏర్పాటు
పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్‌ ఏర్పాటు

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్‌ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో ఐటీ నాలెడ్జి హబ్‌ను ఏర్పాటు చేసి దశలవారీగా ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 450 ఎకరాల భూమిలో ఈ హబ్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనివల్ల హైదరాబాద్‌ అభివృద్ధికి మరింత వేగం వచ్చేస్తుందని ఉపసంఘం అభిప్రాయపడింది. గురువారం సచివాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమలు,రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుప్పాలగూడ పరిసరాల్లో ఉన్న భూములపై సమగ్ర చర్చ జరిగింది.

వివరాలు 

 ఐటీ నాలెడ్జి హబ్‌ అభివృద్ధికి 450 ఎకరాలు

అధికారుల వివరాల ప్రకారం, గతంలో ప్రభుత్వం సుమారు 200 ఎకరాల భూమిని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌ అధికారులు మరియు పలు హౌసింగ్‌ సొసైటీలకు కేటాయించగా, ఇటీవల సుప్రీంకోర్టు ఆ కేటాయింపులను రద్దు చేసింది. ఈ భూములకు సమీపంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC)కు చెందిన మరో 250 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల మొత్తం 450 ఎకరాలు ఈ ఐటీ నాలెడ్జి హబ్‌ అభివృద్ధికి అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

వివరాలు 

నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో హైటెక్‌ సిటీకి శంకుస్థాపన

ఈ సందర్భంగా మంత్రుల కమిటీ మాట్లాడుతూ.. "గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హయాంలో హైటెక్‌ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఆ ప్రాజెక్టు ఆధారంగా కాలక్రమేణా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ అభివృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో చోటుచేసుకుంటున్న ప్రతి కీలక పరిణామంలోనూ హైదరాబాద్‌ పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం వేగంగా మారిపోతున్న తరుణంలో, ఈ మార్పులను హైదరాబాద్‌ ఐటీ రంగం అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలన్న సంకల్పంతో మేం ఈ హబ్‌కు శ్రీకారం చుట్టాం" అని పేర్కొన్నారు.