తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులను కట్టబెడుతూ నిర్ణయించింది. బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులకు మాత్రమే పోటీ పడనున్నారు. ఎస్టీటీ పోస్టులకు బీఈడీలకూ అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ అంశంపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్టీటీ) ఉద్యోగాలకు డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థులనే నియమించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే అతిత్వరలోనే జీవో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.దీంతో ఇకపై బీఈడీ అభ్యర్థులు కేవలం SA పోస్టులకు మాత్రమే అర్హులుగా స్పష్టమైంది.
డీఎడ్ అర్హులతోనే ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయాలని సుప్రీం కీలక తీర్పు
రాజస్థాన్ టీచర్ నియామకాలపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు విచారించిన అత్యున్నత ధర్మాసనం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను బీఎడ్ అభ్యర్థులతో ఎలా భర్తీ చేస్తారని కేంద్రాన్ని నిలదీసింది. ఈ క్రమంలోనే కేవలం డీఎడ్ అర్హులతోనే ఆయా ఎస్జీటీ పోస్టులను భర్తీ చేయాలని కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రతిని NCTE తన వెబ్ సైట్ లో పొందుపర్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 5089 ఖాళీలుండగా, డీఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా 2,575 ఎస్జీటీ, 1,739 ఎస్ఏ పోస్టులను ప్రభుత్వం నింపనుండటం గమనార్హం.