
Telangana: తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా,హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని స్థాపించేందుకు గూగుల్ ముందుకొచ్చింది.
ఈ సెంటర్ దేశంలో మొదటి సారిగా హైదరాబాద్ లో ఏర్పడబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఐదవ సెంటర్ గా ఉండగా, ఏషియా-పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత రెండవ సెంటర్ గా తెలంగాణలో ప్రారంభం కానుంది.
గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్ గా మారనుంది.
ఈ సెంటర్ ఆధునిక భద్రతా పరికరాలు, ఆన్‌లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది.
అలాగే, ఈ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు సహకార వేదికగా మారుతుంది.
వివరాలు
హైదరాబాద్ లో గూగుల్ అతిపెద్ద కార్యాలయం
ఈ గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, దేశంలో సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను సృష్టించడం, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను పెంచడం కోసం పనిచేయనుంది.
గూగుల్ ఇప్పటికే ప్రపంచంలోని అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తోంది.
2024 అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్ఫరెన్స్ లో ఈ సెంటర్ ఏర్పాటు గురించి గూగుల్ ప్రకటించింది.
ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు ఈ సెంటర్‌ను తమ ప్రాంతంలో నెలకొల్పాలని పోటీ పడ్డాయి.
అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత, ప్రభుత్వం ఈ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంది.
వివరాలు
రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైన రాయల్ హాన్సెన్
ఈ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం గూగుల్ తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయమని, రాష్ట్రం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సెంటర్ ఏర్పాటుతో హైదరాబాద్ మరోసారి ప్రపంచంలో మేటి ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా గుర్తింపు పొందనుందని చెప్పారు.
ఈ రోజు (బుధవారం), గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ ఆధ్వర్యంలో గూగుల్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైంది.
వివరాలు
వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు
ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ, "తెలంగాణ రాష్ట్రం డిజిటల్ నైపుణ్యాభివృద్ధిలో ముందంజలో ఉందని" చెప్పారు.
"హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసుల కేంద్రంగా ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్ బుక్ వంటి ఐదు ప్రముఖ టెక్ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి.
సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ద్వారా సైబర్ సెక్యూరిటీ సమస్యలను వేగంగా పరిష్కరించగలుగుతాం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని వెల్లడించారు.