
Revanth Reddy: రేవంత్ కీలక నిర్ణయం.. వారికి ఒక్క పూట మాత్రమే పని
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు బహిరంగంగా తిరగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక్క ప్రజలే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ కార్మికులు వంటి వారు కూడా మండుతున్న ఎండల్లో విధులు నిర్వహించడంలో కష్టాలు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లు , ఇతర కార్మికులకు శుభవార్తను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు ఎండల కారణంగా తీవ్రమైన శారీరక క్షీణతకు గురవుతున్నారని ప్రభుత్వం గుర్తించింది.
వివరాలు
వాతావరణ పరిస్థితులనుబట్టి పని సమయాలు
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పంచాయతీ కార్మికులకు రోజుకు కేవలం ఒక పూట మాత్రమే పని చేయడానికి అనుమతినివ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో పలు కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి.
మండుటెండల్లో పని చేయడం వల్ల తమ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంటూ, విధుల్లో కొంత వెసులుబాటు కల్పించాలని కోరాయి.
ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం,వాతావరణ పరిస్థితులనుబట్టి పని సమయాలను సర్దుబాటు చేసుకునేలా సూచించింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని పంచాయతీల్లో సుమారు 50,000 నుంచి 60,000 మధ్యలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు అనేక రకాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
వివరాలు
ఇంటి పన్ను, ఇతర పన్నుల వసూలు బాధ్యత
వీధుల శుభ్రత, చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్,సున్నం చల్లడం వంటి కార్యకలాపాలతోపాటు, నీటి సరఫరా కోసం ట్యాంకర్లు, ట్రాక్టర్లను నడపడం, నీటి పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించడం, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కలకు నీరు పోయడం వంటి పనులు చేస్తున్నారు.
అంతేకాక, ఇంటి పన్ను, ఇతర పన్నుల వసూలు బాధ్యత కూడా వీరి భుజాలపై ఉంది.
అయితే ఈ కార్మికులు ఎంతో సమర్ధవంతంగా పని చేస్తున్నప్పటికీ,వారు అనేక సమస్యలతో పోరాడుతున్నారు.
ప్రధానంగా జీతాలు సరైన సమయంలో చెల్లించకపోవడం,సిబ్బంది కొరత కారణంగా ఎక్కువ పని ఒత్తిడిని భరించాల్సిన పరిస్థితి,చాలా మంది వర్కర్లు ఎన్నేళ్లుగా పని చేస్తున్నా రెగ్యులరైజ్ చేయకుండా ఉండడం వంటి అంశాలు ఇప్పటికీ పరిష్కారం కావాల్సిన సమస్యలుగానే ఉన్నాయి.