ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మంత్రి గంగులను రక్షించిన భద్రతా సిబ్బంది
కరీంనగర్ గ్రామీణ మండలం, ఆసిఫ్ నగర్ లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి పెను ప్రమాదం తప్పింది. చెరువులో మంత్రి గంగుల కమలాకర్ నాటు పడవ ఎక్కారు. అనంతరం పడవ కంట్రోల్ తప్పి అటూ ఇటూ ఊగుతూ నీటిలో మునిగిపోయింది. దీంతో పట్టు కోల్పోయిన మినిస్టర్ గంగుల ప్రమాదవశాత్తు నీళ్లలోకి జారిపోయారు. అక్కడే ఉన్న మంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పోలీసులతో కలిసి ఆయన్ను ఒడ్డుకు తరలించారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గతంలోనూ మంత్రికి పలు ప్రమాదాలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలను నిర్వహిస్తోంది. అయితే జూన్ 8ని చెరువుల పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని చెరువు వద్దకు వేడుకల నిమిత్తం ప్రభుత్వం తరఫున మంత్రి గంగుల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో నిర్వాహకులు నాటు పడవను ఏర్పాటు చేశారు. దీంతో సదరు మంత్రిని పడవ ఎక్కాలని స్థానిక బీఆర్ఎస్ నేతలు అడిగారు. పార్టీ శ్రేణుల కోరికను కాదనలేక గంగుల పడవలోకి ఎక్కారు. అనంతరం అనుకోకుండా పడవ బాలెన్స్ తప్పింది. దీంతో ప్రమాదం సంభవించింది. గతంలోనూ పలుమార్లు మంత్రికి ఇలాంటి ఘటనలే ఎదురయ్యాయి. తాజాగా మరోసారి ప్రమాదానికి గురికావడం చర్చనీయాంశమైంది.