Page Loader
#NewsBytesExplainer:తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు 'బూచి'గా మారిపోయారా? పార్టీలు వ్యూహాలు ఏమిటి?
తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు 'బూచి'గా మారిపోయారా? పార్టీలు వ్యూహాలు ఏమిటి?

#NewsBytesExplainer:తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు 'బూచి'గా మారిపోయారా? పార్టీలు వ్యూహాలు ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చనీయాంశంగా మారారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, ఆయనను ప్రతి పార్టీ ఒక రకమైన 'బూచి'లా చూపిస్తూ, తమ ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో ఆయన్ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నట్లుగా అనిపిస్తోంది. సాధారణ వ్యాఖ్యలుగా కనిపించే ఈ ప్రకటనల వెనక, ఆయా పార్టీల రాజకీయ లక్ష్యాల్ని సాధించేందుకు ఉన్న వ్యూహాత్మకతను విశ్లేషకులు గమనిస్తున్నారు.

వివరాలు 

నీటి వివాదంపై చంద్రబాబుతో యుద్దనికి సిద్ధం: రేవంత్ రెడ్డి 

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తెలంగాణకు 45 టీఎంసీల నీటిని కేటాయించడం పై అభ్యంతరం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదే సమయంలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ప్రకటించడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేంద్రంతో ఏపీకి అనుకూలంగా భాగస్వామ్యం ఉన్న కారణంగా తెలంగాణపై అన్యాయం జరిగితే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఈ అంశంలో తెలంగాణకు నష్టం జరగదని చంద్రబాబు చెబుతున్నా, సీఎం రేవంత్ మాత్రం బనకచర్ల ప్రాజెక్టుపై పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం ఎంత దూరమైనా పోరాడతామని, మంత్రులతో కలిసి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరాలు అందించారు.

వివరాలు 

చంద్రబాబు గోదావరిని దోచుకెళ్లిపోతున్నారు: బీఆర్‌ఎస్ విమర్శలు 

బీఆర్‌ఎస్ పార్టీ కూడా చంద్రబాబుపై విమర్శలు చేయడంలో వెనుకంజ వేయడం లేదు. సీఎం రేవంత్‌ రెడ్డి చంద్రబాబు పై మౌనంగా ఉన్నారంటూ, గోదావరి నీటిని దోచుకెళ్లిపోతున్నారన్న ఆరోపణలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లాంటి నేతలు గట్టిగా చెబుతున్నారు. అంతేకాకుండా బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి రామచందర్ రావును ఎంపిక చేయడంలో చంద్రబాబు ప్రభావం ఉందంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగుతోంది. డీకే అరుణ, ఈటెల రాజేందర్, రాజా సింగ్ లాంటి నేతలను పక్కనబెట్టి రామచందర్ రావుకు అవకాశం ఇచ్చినట్టు చెబుతున్నారు. నిజానికి, చంద్రబాబు, రామచందర్ రావు మధ్య పెద్దగా సంబంధం ఉండనట్లు తెలుస్తోంది.

వివరాలు 

చంద్రబాబు ప్రభావం అవసరం లేదు: బీజేపీ  

తెలంగాణ బీజేపీ కూడా చంద్రబాబు ప్రభావం తమపై లేదని, ఆయనను నిందిస్తూ విమర్శల దాడిలోకి దిగింది. "నాలుగేళ్లు గడిస్తే చంద్రబాబు ఇంట్లోంచి లేవలేడని అలాంటప్పుడు అయన ఎలా ప్రభావం చూపగలరు?" అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి చంద్రబాబు సహాయం అవసరం లేదని, తమ అధిష్ఠానం స్వతంత్రంగా నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు చెబుతున్నారు.

వివరాలు 

చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారు: కాంగ్రెస్ ఆరోపణలు 

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరో కోణంలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు అనుకూలులుగా పనిచేసే వ్యక్తులు తెలంగాణలో ఉన్నారని, ముఖ్యమైన కాంట్రాక్టులు, ప్రాజెక్టులు అందరి చేతుల్లోనూ ఉన్నాయని అన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విద్యుత్, నీటి కనెక్షన్లు కూడా తొలగించాలని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

చంద్రబాబు చుట్టూ రాజకీయ దుమారం - అసలైన ఉద్దేశం అదేనా? 

పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలూ చంద్రబాబుపై ఒకే రకంగా విమర్శలు చేయడం వెనక రాజకీయ ప్రయోజనమే ఉందని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ ముందుకు తెచ్చి ఓటర్లను తనవైపు తిప్పుకోవాలనే ఆలోచనతో పార్టీలు ఈదారిని ఎంచుకున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. త్వరలో జరగనున్న జిహెచ్ఎంసిఎన్నికల్లో సెటిలర్లు వివిధ పార్టీలకు ఓటు వేసినా,మిగతా తెలంగాణ ఓటు మాత్రం తమకు పడాలని ప్రతీ పార్టీ కోరుకుంటోంది. ఇటీవలి ఇంటర్వ్యూల్లో చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసే అవకాశాలపై స్పష్టత ఇవ్వడం వల్ల తెలంగాణ రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. దీంతో ముందుజాగ్రత్తగా చంద్రబాబును రాజకీయంగా టార్గెట్ చేస్తూ ఓటర్ల మనస్సులు కట్టిపడేయాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈరాజకీయ వ్యూహాలు రానున్నరోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాల్సిందే.