Telangana : తెలంగాణలో యూనియన్ ఎన్నికలకు లైన్ క్లియల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలివే
నల్ల బంగారాన్ని వెలికితీస్తూ ప్రపంచానికి వెలుగులను పంచుతున్న సింగరేణి సంస్థలో రాజకీయ రగడ అంటుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థలో ఎన్నికల సందడి జోరందుకుంది. ఈ మేరకు విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు విస్తృత ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. అగ్రనేతల రాజీనామాలతో అనూహ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబిజీకేఎస్ (TBGKS) చతికిలపడడంతో ఏఐటియూసీ (AITUC) ఐఎన్టియూసీ (INTUC) యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 40 వేల మంది గని కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుర్తింపు సంఘం హోదాను దక్కించుకునేందుకు కార్మిక సంఘాలు విస్తృత ప్రచారంతో ఉరకలేస్తున్నాయి. కాంగ్రెస్,సీపీఐ అనుబంధ సంఘాలతో పాటు మిగితా కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికలను కీలకంగా భావిస్తున్నాయి .
ఎంత మంది ఓటు వినియోగించుకోనున్నారంటే..
ప్రాంతం : ఉత్తర తెలంగాణ జిల్లాలు : ఆరు జిల్లాలు పరిధి : 350 కిలోమీటర్లు ఏరియాలు : 11 అండర్ గ్రౌండ్ మైన్స్ - 23 ఓపెన్ కాస్టు గనులు - 19 వీటి ద్వారా నిత్యం బొగ్గును వెలికితీస్తూ భారతదేశానికే వెలుగులు పంచుతోంది సిరులవేణి. 120ఏళ్లకుపైగా చరిత్ర గల సింగరేణి సంస్థలో ప్రస్తుతం రెగ్యూలర్ కార్మికులు, ఉద్యోగులు కలిపి 42 వేల మంది ఉన్నారు. మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం అధికారులు కాకుండా దాదాపు 40 వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
10 స్థానాల్లో 9 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్
అసెంబ్లీ స్థానాలు : ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, సత్తుపల్లి ఇలా మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. పార్లమెంట్ స్థానాలు : ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ స్థానాల పరిధిలో సింగరేణి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇటీవలే జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో ఉన్న మొత్తం 11 అసెంబ్లీ సీట్లలో ఒక్క ఆసిఫాబాద్ మినహా 9 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెం స్థానంలో మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ గెలుపొందింది.
హైకోర్టు ఆదేశాలతో కదిలిన ఎన్నికలు
మరోవైపు తాజా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే యూనియన్ ఫలితాలు భిన్నంగా ఉంటాయని కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తేనే రాజకీయంగా తమ ప్రాబల్యం కాపాడుకున్నట్టవుతుందని రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి. కోల్ బెల్ట్ రీజియన్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, అందుకోసం సింగరేణిలో అనుబంధ యూనియన్లను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు వాయిదా పడుతుండటంతో కార్మిక సంఘాలు ఎన్నికల కోసం న్యాయ పోరాటాన్ని కొనసాగించాయి. ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో బొగ్గు గనులపై ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి.
6సార్లు సీపీఐ అనుబంధ సంఘానిదే గుర్తింపు హోదా
సింగరేణిలో ఇప్పటివరకు 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగగా, CPI అనుబంధ కార్మిక సంఘం AITUC 3సార్లు, కాంగ్రెస్ అనుబంధ INTUC ఒకసారి, BRS అనుబంధ TBGKS రెండుసార్లు విజయం సాధించాయి. ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. సీఐటీయూ , బీఎంఎస్ ,హెచ్.ఎం.ఎస్ జాతీయ సంఘాలు ప్రాతినిధ్యం కోసం పావులు కదుపుతున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమం, ప్రయోజనాలు తమ హయాంలోనే కల్పించామని జాతీయ కార్మిక సంఘాలు AITUC, INTUC నేతలు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం, గుర్తింపు సంఘం అధికారంలో ఉన్నా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే అపవాదును మూటగట్టుకుందని గులాబీ పార్టీపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.
గత బీఆర్ఎస్ TBGKS గుర్తింపు సంఘంపై తీవ్ర ఆరోపణలు
కారుణ్య నియమాకాల వ్యవహారంలో మెడికల్ బోర్డులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గత గుర్తింపు సంఘంపై తీవ్ర ఆరోపణలున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున తమ యూనియన్ గెలిస్తే సమస్యలు పరిష్కారిస్తామని ఐఎన్టీయూసీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ సంఘాన్ని ఎన్నుకుంటే మళ్లీ తిప్పలు తప్పవని ఏఐటీయూసీ కౌంటర్ ప్రచారాలను ముమ్మరం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలు, కోల్ బెల్ట్ ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్ధులుగా తలపడుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివే కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు గుర్తింపు హోదా సాధించడం కీలకంగా మారడం విశేషం.