Telangana Teachers: తెలంగాణ ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంపొందించేందుకు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఉపాధ్యాయులను ఇతర దేశాలకు పంపించి, వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తూ, ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.
శ్రీధర్ బాబు సమీక్ష
సోమవారం తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. యోగితా రాణా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.
గతంలో ప్రపంచానికి ప్రతిభావంతులను అందించిన ప్రభుత్వ పాఠశాలలు, ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల పోటీని ఎదుర్కొనలేకపోతున్నాయని ఆయన అన్నారు.
దీనికి కారణాలను గుర్తించి, అవసరమైన సంస్కరణలను చేపట్టాలని సూచించారు.
వివరాలు
ప్రభుత్వం సిద్ధంగా ఉంది
"స్కూళ్ల మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు.గుజరాత్ నుంచి ప్రతి సంవత్సరం 30-40 మంది ఉపాధ్యాయులు సింగపూర్‌కు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. అలాంటి విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి" అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
వివరాలు
తెలంగాణకు సింగపూర్ బృందం
"ఫిన్లాండ్, ఫ్రాన్స్, యూకేలో విద్యా ప్రమాణాలను అధ్యయనం చేసి, మన విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలి. సింగపూర్ ప్రభుత్వం, మన రాష్ట్రంలో ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. త్వరలోనే సింగపూర్ బృందం తెలంగాణలో పర్యటించనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సిద్ధం చేయాలి" అని శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.
వివరాలు
సమూల మార్పులు రావాలి
"వచ్చే 2-3 ఏళ్లలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలి. ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల విధానాలను అధ్యయనం చేసి, వాటిని అమలు చేయడం గురించి పరిశీలించాలి. చిన్న తరగతుల నుంచే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించాలి. హైస్కూల్ స్థాయిలో దాన్ని వినియోగించి, వారి తెలివితేటలను పెంచే విధంగా చూడాలి. కన్సల్టెంట్ల సూచనలను అనుసరించి కార్యాచరణ సిద్ధం చేయాలి" అని మంత్రి వివరించారు.
వివరాలు
మార్గదర్శకాలు అవసరం
"గతంలో డీఈవోలు తరచూ పాఠశాలలను తనిఖీ చేసేవారు. ప్రస్తుతం ఎంఈవోలు ఇతర పనుల్లో నిమగ్నమై, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం మరిచిపోతున్నారు. గతంలో స్కూళ్లలో వక్తృత్వ పోటీలు, విద్యార్థుల పిక్నిక్‌లు, ఎక్సకర్షన్‌లు జరుగుతుండేవి. ఇవన్నీ ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్నాయి. మన ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి. భవిష్యత్ తరానికి ప్రపంచస్థాయి విద్యను అందించగలిగితేనే, వారు అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగలుగుతారు. సమూల మార్పుల కోసం తగిన చర్యలు తీసుకోవాలి" అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.