LOADING...
Heavy Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలపై అధిక ప్రభావం 
నేడు, రేపు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలపై అధిక ప్రభావం

Heavy Rains: నేడు, రేపు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలపై అధిక ప్రభావం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2025
07:58 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపింది. అదనంగా రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రభావం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం,జయశంకర్ భూపాలపల్లి,మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాలలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ. వేగంతో) వీస్తూ, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, గత ఐదు రోజులుగా వర్షపాతం తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ వివరించింది.

వివరాలు 

10 జిల్లాలలో వర్షాల లోటు 

ఆగస్టు చివరి వారానికి చేరుకున్నప్పటికీ రాష్ట్రంలోని పది జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాంతోపాటు రాష్ట్ర సగటు వర్షపాతం కూడా తగ్గుతూ వస్తోంది. ఈ నెలలో మొదట కురిసిన భారీ వర్షాల కారణంగా ఆగస్టు 18వ తేదీ నాటికి రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే 14 శాతం అధికంగా నమోదైంది. కానీ, ఆ తరువాత వర్షాలు తగ్గిపోవడంతో సోమవారం నాటికి రాష్ట్రంలో సగటు వర్షపాతం తొమ్మిది శాతం లోటులోకి జారింది.

వివరాలు 

జిల్లాల వారీగా చూస్తే..

నిర్మల్ జిల్లాలో సాధారణం కంటే 44% తక్కువ వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో 21% లోటు ఉంది. జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ జిల్లాలలో చెరో 13% తగ్గుదల నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో చెరో 12% లోటు ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11%, మంచిర్యాల జిల్లాలో 10% తక్కువ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 6% లోటు నమోదవగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4% లోటు నమోదైంది.