
AP High Court : హైకోర్టులో వైసీపీ నేతలకు తాత్కాలిక ఊరట.. కొడాలి నానికి బిగ్ రిలీఫ్!
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. పార్టీకి చెందిన నేతలపై నమోదైన వివిధ కేసుల్లో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి ఈసందర్భంగా ఉపశమనం లభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ఘటనలో గుంటూరు మిర్చియార్డ్‌ను సందర్శించిన తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో కూడా హైకోర్టు తదుపరి విచారణ వరకు అన్ని చర్యలను నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈకేసులో విచారణను ఒక నెల పాటు వాయిదా వేసింది. అదేవిధంగా మచిలీపట్నంలో కొడాలి నానిపై నమోదైన కేసులో కూడా తదుపరి చర్యలకు స్టే విధించింది.
Details
నెల రోజుల పాటు వాయిదా
ఈ కేసును కూడా నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఆవిధంగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని స్పష్టంగా పేర్కొంది. మరోవైపు, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై పోలీసులకు తక్షణ చర్యలు చేపట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్య సాయి జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసిన ఘటనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో తోపుదుర్తిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలకు తాత్కాలిక ఊరట లభించింది.