LOADING...
Kaleshwaram Project: కాళేశ్వరంపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా.. సీబీఐ విచారణ జరపండి..కేంద్ర హోం శాఖకు లేఖ  
సీబీఐ విచారణ జరపండి..కేంద్ర హోం శాఖకు లేఖ

Kaleshwaram Project: కాళేశ్వరంపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా.. సీబీఐ విచారణ జరపండి..కేంద్ర హోం శాఖకు లేఖ  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కేసును సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశంలో ఈ నివేదికపై చర్చ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. అర్ధరాత్రి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ... కమిషన్ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం కోసం కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనికి సభ సమ్మతి తెలిపింది.అనంతరం సోమవారం రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ లేఖ పంపినట్లు సమాచారం. ముందుగా నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి అనుమతులు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం కూడా పొందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

భారీ స్థాయిలో ప్రజాధనం వృథా 

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జులై 31న సమర్పించిన నివేదికలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ పనుల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా పేర్కొంది. భారీ స్థాయిలో ప్రజాధనం వృథా అయ్యిందని, ప్రణాళికా లోపాలు, డిజైన్ తప్పిదాలు, పనుల నాణ్యత లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. ఇప్పటికే నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ (NDSA) కూడా దర్యాప్తు చేసి మేడిగడ్డ బ్యారేజి వైఫల్యానికి ఇవే కారణాలని నిర్ధారించింది. ఈ రెండు నివేదికలు మరింత లోతైన విచారణ అవసరమని సూచించాయి. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర-రాష్ట్ర శాఖల ప్రమేయం ఉండటంతో సీబీఐ మాత్రమే సమగ్ర దర్యాప్తు చేయగలదని సీఎం రేవంత్ వెల్లడించగా, శాసనసభ ఆమోదం తెలిపింది.

వివరాలు 

సీబీఐ అంగీకరిస్తే దర్యాప్తు పునఃప్రారంభం 

కేంద్ర హోంశాఖ అనుమతి ఇస్తే సీబీఐ దర్యాప్తు అధికారికంగా మొదలవుతుంది. మేడిగడ్డ పనులకు చెల్లించిన బిల్లులు ఎవరికెంత చేరాయి? చివరికి డబ్బు లబ్ధిదారులు ఎవరు? అనే అంశాలను సీబీఐ మరింత లోతుగా పరిశీలించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై కూడా విచారణ జరపాలని సూచించింది. అలాగే, మేడిగడ్డ బ్యారేజి ఏడో బ్లాక్ తిరిగి నిర్మించాల్సి వస్తే ఖర్చు కాంట్రాక్టర్ భరించాలని పేర్కొంది. అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థల విషయంలో కూడా ఇదే విధానం అమలు చేయాలని సిఫార్సు చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉందని నివేదిక స్పష్టం చేసింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను కూడా తప్పు పట్టింది.

వివరాలు 

సాధారణ ప్రక్రియలో భాగమే: సీఎం రేవంత్ 

ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో, సీబీఐ దర్యాప్తు మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఇంజినీర్లలో పెరుగుతోంది. తెలంగాణలో సీబీఐ విచారణలకు ఎటువంటి అడ్డంకులు లేవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ''నేను సీఎం అయిన తర్వాత పలు కేసుల దర్యాప్తుకు అనుమతి ఇవ్వమని ఫైళ్ళు వస్తే వెంటనే ఆమోదం తెలుపుతున్నాను. ఇది ఎప్పుడూ జరిగే సాధారణ ప్రక్రియే. ఇప్పుడు శాసనసభ నిర్ణయంతో కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణకు లేఖ పంపాం. ఇక ఎలాంటి సమస్య ఉండదు'' అని తెలిపారు.

వివరాలు 

దాని ఆధారంగా సీబీఐ దర్యాప్తు

గతంలో తెలంగాణలో సీబీఐకి విచారణలపై పరిమితులు విధించినట్లు మీడియా గుర్తుచేయగా, ఆయన స్పందిస్తూ... ''ఏ రాష్ట్రంలోనైనా, ఏ కేసులోనైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే కోర్టు ఆదేశం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. బ్యాంకు మోసాల విషయంలో సీబీఐ నేరుగా విచారణ చేస్తోంది. అలాంటి కేసులకూ నేను సీఎంగా తరచూ అనుమతులు ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ ఇచ్చింది. దాని ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తుంది'' అని వివరించారు.