CM Chandrababu: ఆర్థిక భారం పెరిగింది.. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు: సీఎం చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు జిల్లా జీడినెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు అందించడంలేదని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని రూ. 3,000గా నిర్ణయించగా, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రూ. 4,000కు పెంచామని వివరించారు.
గత ఐదేళ్లలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు తమ ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తోందని సీఎం తెలిపారు.
ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Details
ఈ ఏడాది రూ.3లక్షల కోట్ల బడ్జెట్
నెల ప్రారంభమైన వెంటనే పెన్షన్లు అందజేయాలని నిర్ణయించామని, ఈ ఏడాది రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామని వివరించారు.
ప్రస్తుతం రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉన్నా సంక్షేమాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా నెలకు 8 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, అలాగే తలసేమియా, డయాలసిస్ రోగులకు నెలకు రూ. 10,000 పింఛన్ అందిస్తున్నట్లు వివరించారు.
నెలకు రూ. 2,800 కోట్లు, ఏడాదికి రూ. 33,000 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. జీడినెల్లూరులో తల్లిదండ్రులు వదిలేసిన ఇద్దరు ఆడపిల్లలను ప్రభుత్వం ఆదుకున్నట్లు పేర్కొన్నారు.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు లూటీ చేశారని ఆరోపించారు.
Details
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మెరుగైన సేవలు
రూ. 9371 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి, కేంద్రానికి నివేదికలు పంపినట్లు తెలిపారు.
గత నాలుగు నెలల్లో 20,000 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేశామని, ఎనిమిది నెలల్లో ఉద్యోగులకు రూ. 24,000 కోట్ల బకాయిలు చెల్లించినట్లు వివరించారు.
సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత కరెంట్ పొందే అవకాశం ఉందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు తానే డ్వాక్రా సంఘాలను ప్రారంభించానని చంద్రబాబు గుర్తు చేశారు.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.