Terror Attack: స్వాతంత్య్ర దినోత్సవం వేళ దిల్లీపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్
పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ రాజధానిలో దిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ లక్ష్యంగా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. జీ20 సమావేశాలకు ముందు దాడులు చేసి దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నించవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. దిల్లీలో ప్రధానంగా రైల్వే స్టేషన్లు, విదేశీ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని నిఘా వర్గాల నివేదిక చెబుతోంది.
ఎర్రకోట వద్ద 10వేల మంది పోలీసుల మోహరింపు
టెర్రర్ గ్రూపులు దిల్లీలో ప్రముఖ రహదారులు, రైల్వే సంస్థలు, దిల్లీ పోలీసుల కార్యాలయాలు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రధాన కార్యాలయంపై దాడులు చేసేందుకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల నివేదిక వివరిస్తోంది. దీంతో దిల్లీలో భద్రత దళాలు నిఘాను పెంచాయి. దిల్లీ పోలీసులు నగరంలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశాయి. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ఎర్రకోట వద్ద సుమారు 10,000 మంది పోలీసులు మోహరించారు. 1,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లు, ఇతర నిఘా చర్యలను చేపట్టారు. దిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు ఈ ఏడాది సమాచారం అందింది.