Hanuman Flag: "హనుమాన్ జెండా" తొలగించినందుకు కర్ణాటకలో నిరసనలు.. సై అంటే సై అంటున్న కాంగ్రెస్,బీజేపీ
Hanuman Flag: కర్ణాటకలోని మాండ్యాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. హనుమాన్ జెండాను తొలగించడంతో రాజకీయ ఘర్షణలు, నిరసనలు మొదలయ్యాయి. గతవారం108 అడుగుల ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించి హనుమంతుని జెండాను ఎగురవేశారు. ధ్వజస్తంభం ఏర్పాటుకు గ్రామ పంచాయతీ అనుమతి మంజూరు చేసింది, అయితే దానిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. హనుమాన్ జెండాను తొలగించాలని అధికారులు అభ్యర్థించారు. అయితే కొంతమంది వ్యక్తులు ఈ విషయాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. పోలీసులు భారీ బందోబస్తును మోహరించారు.బీజేపీ, జెడి(ఎస్), బజరంగ్ దళ్ సభ్యులు గ్రామస్తులతో కలిసి తొలగింపుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. శనివారం గ్రామస్తులు తమ దుకాణాలను బంద్ చేయడంతో నిరసనలు ఉధృతమయ్యాయి.
బెంగళూరులోని,ఇతర జిల్లాల్లో నిరసన చేపట్టాలని బీజేపీ యోచన
నిన్న గ్రామ పంచాయతీ అధికారులు జెండాను తొలగించేందుకు గ్రామాన్ని సందర్శించారు. దీంతో గ్రామస్తులు అధికారులపై నిరసనగా 'గో బ్యాక్' నినాదాలు చేశారు. నిరసనల సందర్భంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ బ్యానర్లను ధ్వంసం చేయడంతో వివాదం రాజకీయ మలుపు తిరిగింది. ప్రతిస్పందనగా, జెండా తొలగింపును హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జెండా తొలగింపును బీజేపీ నేతలు,హిందూ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఈరోజు బెంగళూరులోని మైసూరు బ్యాంక్ సర్కిల్‌లో,ఇతర జిల్లాల్లో నిరసన చేపట్టాలని బీజేపీ యోచిస్తున్నట్లు ప్రకటించింది. హనుమాన్ జెండా స్థానంలో జాతీయ జెండాను జెండా స్తంభంపై ఉంచారు. ఫ్లాగ్ పోస్ట్ సంస్థాపనకు కెరగోడు, 12 పొరుగు గ్రామాల నివాసితులు నిధులు సమకూర్చారని,బిజెపి, జెడి (ఎస్) కార్యకర్తల క్రియాశీల ప్రమేయంతో అధికారిక వర్గాలు వెల్లడించాయి.
స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
పోలీసుల జోక్యానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. బిజెపి నాయకుడు ఆర్ అశోక ప్రభుత్వ "హిందూ వ్యతిరేక వైఖరిని" ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జెండాను హఠాత్తుగా తొలగించడాన్ని ప్రశ్నిస్తూ గ్రామ పంచాయతీ ఆమోదంతోనే హనుమంతు జెండాను ఎగురవేసిందని వాదించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) స్పందిస్తూ.. జాతీయ జెండాకు బదులు కాషాయ జెండాను ఎగరేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ధ్వజస్థంభం ఉన్న స్థలం పంచాయతీ పరిధిలోకి వస్తుందని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసేందుకు తొలుత అనుమతి లభించిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్.చెలువరాయస్వామి(N Cheluvarayaswamy) స్పష్టం చేశారు.