
Telangana: ఆర్థిక శక్తిగా దక్షిణాది ముందంజ.. మొదటి స్థానంలో ఎవరున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఆర్థిక వికాసంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పరంగా ఈ ప్రాంత రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే వేగంగా ఎదుగుతున్నాయని తాజాగా సీబీఆర్‌ఈ-సీఐఐ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. రూ.87 లక్షల కోట్లకు సమానమైన 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. నూతన సాంకేతికత, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), విద్యుత్తు వాహనాల ఉత్పత్తి, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ రంగాల్లో విస్తరణకు ఈ రాష్ట్రాలు నాంది పలికినట్టు పేర్కొంది.
Details
మెట్రో నగరాలు కీలక పాత్ర
అలాగే జీవశాస్త్రాలు, పర్యాటక రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ మార్గంలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు కీలక భూమిక వహిస్తున్నాయంటూ విశ్లేషించింది. ప్రపంచ స్థాయి ప్రతిభ, సమగ్ర మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు ఈ నగరాలను ఆర్థిక కేంద్రమాలుగా మార్చుతున్నాయని వివరించింది. ఇప్పటివరకు భారతదేశంలో ఒక్క రాష్ట్రం కూడా 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారలేదని నివేదిక స్పష్టం చేసింది. మహారాష్ట్ర ముందంజలో ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా పోటీగా ఉన్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల లక్ష్యాలపై ప్రత్యేకంగా వివరించింది.
Details
తమిళనాడు - లక్ష్యం: 2030
విద్యుత్తు వాహనాల తయారీ, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మరింత ప్రోత్సాహం అవసరం. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు, పోర్ట్ ఆధారిత పరిశ్రమల కారిడార్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటక - లక్ష్యం: 2032 బెంగళూరు మహానగరంతో పాటు ఇతర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. అంకుర సంస్థల కేంద్రంగా ఉన్న ఈ రాష్ట్రంలో వాహన, ఫార్మా, యంత్రాల రంగాల్లో ఉత్పత్తి వేగవంతం చేయాలి. తీరప్రాంతం, పర్యాటక రంగాలపై దృష్టి పెడితే లక్ష్యం చేరుకోవచ్చు.
Details
తెలంగాణ - లక్ష్యం: 2036
జీవశాస్త్రాలు, ఫార్మా రంగాల్లో వృద్ధిని మరింత వేగవంతం చేయాలి. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పరిశోధనా సంస్థలకు బలోపేతం అవసరం. రవాణా, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఐటీ రంగాన్ని ఇతర నగరాలకు విస్తరించడం, 'భారత్ ఫ్యూచర్ సిటీ' అభివృద్ధి చేయడం కీలకం. ద్వితీయ శ్రేణి నగరాల పురోగతిపై మరింత దృష్టి పెట్టాలి. తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, "కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీల పరంగా తెలంగాణను ప్రపంచస్థాయి నేతగా తీర్చిదిద్దే లక్ష్యం పెట్టుకున్నాం. ఐటీ ఆధారిత పరిశ్రమలే రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే ప్రాధాన్యమైన శక్తిగా మారనున్నాయని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ఈ ప్రణాళికలు దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశకంగా నిలవనున్నాయి.