Hyderabad Weather: వణుకుతున్న రాష్ట్రం.. చలి తీవ్రత కారణంగా ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమయ్యే చలిగాలులు మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు తగ్గడం లేదు. పొగమంచు కారణంగా దూర ప్రాంతాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఆగమేఘాలపై ప్రయాణాలు తగ్గాయి. సోమవారం పటాన్ చెరువులో 6.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, ఈ సీజన్‌లో ఇవే అత్యల్ప ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. చలి తీవ్రతతో ఉదయం పాఠశాలలకు వెళ్లే పిల్లలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు చలికి గజగజ వణికిపోతున్నారు.
రేపు చలి తీవ్రత పెరిగే అవకాశం
ముఖ్యంగా తెల్లవారుజామున రోడ్లపై ప్రయాణం చేసే వాహనదారులు చలి వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మార్నింగ్ వాక్‌కి వెళ్లే వారు కూడా ఆలస్యంగా బయటకు వస్తున్నారు. వాతావరణ శాఖ మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికలు జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు ఉన్నాయి. బుధవారం ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికలు అమలులో ఉంటాయి.
వాతావరణ సూచనలు పాటించాలి
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరికొన్ని రోజుల్లో తమిళనాడు తీరం వైపు చేరే అవకాశాలున్నాయి. చలి తీవ్రతతో నగరంలో ఊటీ తరహా వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బస్టాండ్ల వద్ద తగ్గింది. ప్రజలు స్వెటర్లు, మాస్కులు లేకుండా బయటకు రావడం అసాధ్యమైపోయింది. వాతావరణ శాఖ సూచనలను పాటించి, చలి నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.