
DK Shivakumar: సీఎం కావాలని ఆశపడటంతో తప్పు లేదు.. కానీ నిర్ణయం పార్టీదే : డీకే శివకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై రాజకీయం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రి అని సిద్ధరామయ్య ప్రకటించినా, తన చేతుల్లో ఏమీ లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అనడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో శివకుమార్ మరోసారి స్పందించడంతో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. రంభపురి పీఠాధిపతి శ్రీ రాజదేశికేంద్ర శివచార్య స్వామితో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ 2023 ఎన్నికల అనంతరం శివకుమార్‌కు ఉన్నత పదవి దక్కాల్సింది. కాంగ్రెస్ విజయంలో ఆయన చేసిన కృషిని ప్రజలంతా చూశారని అన్నారు.
Details
పార్టీని అందరం కలిసి నిర్మించాం
దీనిపై స్పందించిన డీకే శివకుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు, ప్రజలు, మఠాధిపతులు తమ అభీష్టాలను వ్యక్తం చేయడం సహజం. వారిది తప్పు అని చెప్పలేను. అయితే, మేం అందరం కలిసి పార్టీని నిర్మించాం. మేం క్రమశిక్షణ గల సైనికులం. పార్టీ నిర్ణయం ఏదైతే వుంటుందో అదే అమలవుతుంది. సిద్ధరామయ్య కూడా ఇదే విషయాన్ని అనేకసార్లు చెప్పారని వ్యాఖ్యానించారు. అనవసర విషయాలపై పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్షాలు, మీడియా చర్చించడం మంచిదికాదని శివకుమార్ సూచించారు. కాంగ్రెస్‌పై విశ్వాసంతో ప్రజలు అధికారాన్ని అందించారని, వారి అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Details
పదవి మార్పుపై కొంతకాలంగా ప్రచారం
ఇక ముఖ్యమంత్రి పదవి మార్పుపై గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పు జరుగుతుందనే వార్తలు వెలుగుచూశాయి. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ విషయంపై బహిరంగంగా స్పందించడం కూడా రాజకీయ వేడి పెంచింది. అయితే సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తే పార్టీకి విడిపోతే ప్రమాదమని భావిస్తున్న అధిష్ఠానం, ఆయన్నే కొనసాగించడంపై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.