Page Loader
Denver: హైదరాబాద్ స్టార్టప్‌లో శునకానికి ఉన్నత పదవి.. డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్
డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్

Denver: హైదరాబాద్ స్టార్టప్‌లో శునకానికి ఉన్నత పదవి.. డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తోంది. తమ కార్యాలయంలో సానుకూలతను పెంపొందించేందుకు, ఉద్యోగుల హర్షాతిరేకాలను పెంచేందుకు, ఈ సంస్థ ఏకంగా ఒక గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన శునకాన్ని ఒక ప్రత్యేకమైన పదవికి నియమించింది. 'డెన్వర్' అనే ఈ శునకాన్ని ఇప్పుడు ఆ సంస్థ 'చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ (CH0)'గా అధికారికంగా నియమించుకుంది.

వివరాలు 

వ్యవసాయానికి టెక్నాలజీ అందిస్తున్న 'హార్వెస్టింగ్ రోబోటిక్స్' 

ఈవినూత్న ఆలోచన హార్వెస్టింగ్ రోబోటిక్స్ అనే స్టార్టప్‌కి చెందింది. ఈసంస్థ వ్యవసాయంలో రైతులకు స్థిరమైన పద్ధతుల్లో పంటలు పండించేందుకు లేజర్-వీడింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ ఆరెపాక లింక్డ్‌ఇన్‌లో ఒకపోస్ట్ ద్వారా డెన్వర్‌ను పరిచయం చేశారు.ఆపోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. డెన్వర్ ఎలాంటి పనులు చేస్తాడు? "మా బృందంలో కొత్తగా చేరిన డెన్వర్..చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్.ఇతను కోడింగ్ చేయడు,తాత్వికంగా ఏమీ ఆలోచించడు. కానీ ఆఫీసుకు వచ్చిన వెంటనే అందరి మనసును గెలుచుకుంటాడు.కార్యాలయ వాతావరణాన్నిఉత్తేజంగా మార్చేస్తాడు.ఇక మేము అధికారికంగా పెట్-ఫ్రెండ్లీ ఆఫీస్‌గా మారిన విషయాన్ని చెప్పడంలో మాకు గర్వంగా ఉంది. అతనికి అందుబాటులో ఉన్న సౌకర్యాలే మనకు స్ఫూర్తిదాయకం" అని రాహుల్ ఆరెపాక వివరించారు.

వివరాలు 

నెటిజన్ల స్పందన 

ఈ నిర్ణయం తమ సంస్థ తీసుకున్న అతి గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు కొన్ని వేల లైకులు వచ్చాయి. అంతేకాక, ప్రేమతో కూడిన కామెంట్ల వర్షం కురిసింది. డెన్వర్ పాత్రను ప్రశంసిస్తూ పలువురు స్పందించారు. ఒకరు సరదాగా - "సీహెచ్‌ఓ గారు అందరినీ ఆనందంగా ఉంచే ప్రయత్నంలో అలసిపోయినట్టున్నారు" అని కామెంట్ చేయగా, ఇంకొకరు - "నాలుగు కాళ్లు, సున్నా ఒత్తిడి & 100% తోక ఊపే సానుకూలత! అద్భుతమైన చొరవ" అని రాశారు.

వివరాలు 

పర్‌ఫెక్ట్ రిటర్న్ టు ఆఫీస్ మోడల్ ఇదే..

ఈ చొరవను చూసి ఇతర కంపెనీలూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. "ఇలాంటి సీహెచ్‌ఓలు మరిన్ని కావాలి. ఇది ప్రపంచవ్యాప్త అవసరం. పర్‌ఫెక్ట్ రిటర్న్ టు ఆఫీస్ మోడల్ ఇదే" అని ఒకరు వ్యాఖ్యానించగా, "నేను అయితే నా సీటు వదిలే వాడిని కాదు. డెన్వర్‌కి దాన్ని ఇచ్చే వాడిని కాదు" అని మరొకరు సరదాగా స్పందించారు.

వివరాలు 

కార్యాలయాలను పెంపుడు జంతువులకు అనుకూలంగా

ఇటీవలి కాలంలో అనేక ప్రముఖ సంస్థలు ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు తమ కార్యాలయాలను పెంపుడు జంతువులకు అనుకూలంగా మార్చుతున్నాయి. గూగుల్, అమెజాన్, జాపోస్ వంటి సంస్థలు ఇలాంటి ఆచరణలో ముందున్నారు. పెంపుడు జంతువులు కార్యాలయ వాతావరణాన్ని మరింత ఆహ్లాదంగా మారుస్తాయని, సహచర ఉద్యోగుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయని, ఉత్పాదకతను మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. హ్యూమన్ యానిమల్ బాండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (HABRI) నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం, పెంపుడు జంతువులను అనుమతించే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల్లో 87 శాతం మంది తమ సంస్థలోనే కొనసాగాలని భావిస్తుండగా, 91 శాతం మంది తమ పని మీద ఎక్కువగా నిమగ్నమై ఉంటారని వెల్లడైంది.

వివరాలు 

ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం 

హార్వెస్టింగ్ రోబోటిక్స్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర సంస్థలూ ఈ విధానం నుంచి ప్రేరణ పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.