Page Loader
Rains: ఈసారి మోస్తరు కంటే అధిక వర్షాలు.. ఐఎండీ వెల్లడి
ఈసారి మోస్తరు కంటే అధిక వర్షాలు.. ఐఎండీ వెల్లడి

Rains: ఈసారి మోస్తరు కంటే అధిక వర్షాలు.. ఐఎండీ వెల్లడి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. దీర్ఘకాలిక సగటు వర్షపాతం (166.9 మి.మీ.)తో పోలిస్తే 108% వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో సగటు (87 మి.మీ.) కంటే 106% వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Details

ఈశాన్య రాష్ట్రంలో తక్కువ వర్షాలు

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా సహా పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయని, వాయవ్య భారతదేశంలో సాధారణ స్థాయిలో, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం తక్కువ వర్షాలు పడతాయని వివరించింది. అంతేగాక, మధ్య, దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతాల్లో సగటు వర్షపాతాన్ని మించే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. పసిఫిక్‌ సముద్రంలో ఎల్‌నినో ప్రభావం ప్రస్తుతం తటస్థంగా ఉన్నా ఈసారి రుతుపవనాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని ఐఎండీ స్పష్టం చేసింది.

Details

 కేరళలో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి 

రుతుపవనాలు ముంబయిని చేరిన వెంటనే 24 గంటల్లో 106 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం పరిస్థితి కొంత మెరుగైనదిగా కనిపించినా, పలు ప్రాంతాలు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. సబర్బన్‌ రైళ్లు, బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేరళలో మాత్రం పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మంగళవారం కూడా భారీ వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించపోయింది. వృక్షాలు కూలి రైలుపట్టాలపై పడటంతో అనేక రైళ్లు ఆలస్యమయ్యాయి. వరదలతో ప్రభావితమైన ప్రాంతాల ప్రజలను పడవల ద్వారా తరలిస్తున్నారు. తిరువనంతపురం సమీపంలోని కల్లార్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Details

మహారాష్ట్రలో నలుగురు మృతి

మహారాష్ట్ర మరాఠ్వాడాలో వరద ఉధృతికి నలుగురు మృతిచెందగా, ఒకరు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. కేరళలో తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, ఎర్నాకుళం, కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ అయింది. పంటలు నీటమునిగి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. వర్షాలు మరింత విస్తరించే సూచనలు వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంగా మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ బెంగాల్ వైపు కదలుతూ గురువారంలోగా తీవ్ర అల్పపీడనంగా, ఆపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Details

ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు 

దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా రావివలసలో 80 మి.మీ., విజయనగరం జిల్లా రాజాంలో 87.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌-సెప్టెంబర్ మధ్యకాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడతాయని పేర్కొంది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించే అవకాశముందని తెలిపింది.