హస్తం గూటికి తుమ్మల నాగేశ్వరరావు.. ఎప్పుడంటే?
తెలంగాణ సీనియర్ రాజకీయ వేత్త తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తుమ్మల నివాసానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ ఠాక్రే, పీసీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. ఈ సమావేశంలో పార్టీలో చేరిక, సీటుపైన నిర్ణయం జరిగినట్లు సమాచారం. టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల హాయంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
పాలేరు బరిలో తుమ్మల నాగేశ్వరరావు?
బీఆర్ఎస్ ప్రకటించిన అసెంబ్లీ పేర్ల జాబితాలో తుమ్మల పేరును బీఆర్ఎస్ ప్రకటించలేదు. దీంతో పార్టీ మార్పుపై ఆలోచన చేశారు. ఖమ్మంలో రాజకీయంగా చాలా కాలంగా ఉప్పు-నిప్పులా ఉన్న పొంగులేటి, తుమ్మల భేటితో జిల్లా రాజకీయం మరింత వేడిక్కింది. ఒక వేళ షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే ఆమె స్థానం ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటి చేస్తానని ప్రకటించారు. తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి హామీ లభించినా, పార్టీలో మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు పాలేరు నుంచి తుమ్మలను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రయత్నిస్తోంది.