
Tirupati: తిరుపతిలో వరల్డ్ క్లాస్ బస్ స్టేషన్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో సమగ్రంగా రూపొందించబోయే బస్ స్టేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రోజుకు లక్షల సంఖ్యలో ప్రయాణికులకు సేవలు అందించగలిగే ఈ కొత్త బస్ స్టేషన్ డిజైన్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో బస్ స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు, భవిష్యత్తులో అవసరాలను పూరించగలిగేలా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ కొత్త బస్ స్టేషన్ 13 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఒకేసారి 150 బస్సులను ఉంచగల బస్ బే కలిగి ఉంటుంది
వివరాలు
ట్రాఫిక్ సజావుగా సాగేలా రెండు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు
ప్రణాళికలో హెలిప్యాడ్, రోప్‌వే, వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు, సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు ప్రణాళికలో ఉన్నాయి. స్టేషన్‌లో ట్రాఫిక్ సజావుగా సాగేలా రెండు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక, రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే సమగ్ర ప్రణాళికను రూపొందించమని ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్యావరణ అనుకూల రవాణా అవసరాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సుల వాడకం పెరుగుతుందని, వాటి కోసం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
వివరాలు
మౌలిక సదుపాయాలు చాలా కీలకం
ఏపీఎస్‌ఆర్టీసీ భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులకు మారాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, అందుకు తగిన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా, అధికారులు ఐదు డిజైన్ నమూనాలను సమర్పించారు. సీఎం చంద్రబాబు వాటన్నింటినీ పరిశీలించి, పలు సూచనలు ఇచ్చారు. ప్రణాళికను ఖరారు చేయడానికి ముందు వాటాదారులతో సంప్రదింపులు జరపాలని అన్నారు. ముఖ్యంగా, తిరుపతి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న హోదాకు అనుగుణంగా, ఆధునిక సౌకర్యాలను అందించడమే కాక, పెరుగుతున్న యాత్రికుల రద్దీని కూడా సమర్థవంతంగా నిర్వహించగల బస్ స్టేషన్‌గా రూపొందించాలన్నారు.