Dunki Route:డంకీ రూట్‌లో అమెరికాకు ప్రయాణం.. మార్గమధ్యంలో పంజాబీ యువకుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా తన దేశానికి అక్రమంగా వచ్చిన 104 మంది భారతీయులను ఇటీవల తిరిగి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్రమంగా అమెరికా వెళ్లే మార్గాలపై చర్చ మళ్లీ ఊపందుకుంది.
తాజాగా ఓ పంజాబ్ యువకుడు డంకీ రూట్ ద్వారా అమెరికా వెళ్లే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
33 ఏళ్ల గుర్‌ప్రీత్ సింగ్ గ్వాటెమాలాలో గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం గురించి మృతుడి కుటుంబసభ్యులు వివరించారు.
తన సోదరుడు గుర్‌ప్రీత్ మూడు నెలల కిందట అమెరికా వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు.
ఈ ప్రయాణానికి చండీగఢ్‌కు చెందిన ఏజెంట్ బల్వీందర్‌సింగ్‌ను సంప్రదించి రూ. 16.5 లక్షలు చెల్లించాడు. అతను గుర్‌ప్రీత్‌ను గయానాకు పంపించాడు.
Details
మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలి
అక్కడ ఓ పాకిస్థానీ ఏజెంట్‌కు అప్పగించారు.ఆ తర్వాత మరికొందరు వలసదారులతో కలిసి పనామా అడవి గుండా కొలంబియాకు ప్రయాణం సాగించాడు.
మార్గమధ్యంలో గ్వాటెమాలాలో ఓ హోటల్‌లో ఉన్నట్లు తమకు ఫోన్‌లో చెప్పాడు.
ఆ తర్వాత ఓ వ్యక్తి తమకు కాల్ చేసి గుర్‌ప్రీత్ ఆరోగ్యం విషమించిందని, కారులో ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని తెలిపాడు.
ఇక ఐదారు నిమిషాలకే అతను మరణించినట్లు సమాచారమిచ్చారని గుర్‌ప్రీత్ సోదరుడు తారాసింగ్ కన్నీరు మున్నీరయ్యారు.
ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. ఈ విషాదకర ఘటనపై పంజాబ్ మంత్రి కుల్దీప్‌సింగ్ దలివాల్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
Details
చట్టప్రకారం అనుమతులు తీసుకోవాలి
గుర్‌ప్రీత్ మరణం బాధాకరమని, ఎవరైనా చట్టపరమైన అనుమతులు తీసుకుని మాత్రమే విదేశాలకు వెళ్లాలని, అక్రమ మార్గాలను అనుసరించడం ప్రమాదకరమని మంత్రి సూచించారు.
అమెరికాలో అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అక్రమ వలసదారుల గుర్తింపు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు.
అందులో భాగంగా ఇటీవల 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.