ఏపీలో గిరిజన వ్యక్తిపై అమానుషం.. మద్యం మత్తులో నోట్లో మూత్రం
ఆంధ్రప్రదేశ్ లో అమానుష సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన సంఘటన మరువకముందే ఏపీలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మద్యం తాగుదామని ఓ గిరిజన యువకుడ్ని పిలిపించిన కొందరు, బాధితుడికి విపరీతంగా మద్యం తాగించారు. అనంతరం విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ గిరిజన యువకుడిపై 9 మంది వ్యక్తులు అమానవీయంగా ప్రవర్తించారు. బాధితుడు మోటా నవీన్ నోట్లో మూత్రం పోస్తూ తాగాలని సామూహికంగా చావబాదారు. తనను వదిలిపెట్టాలని బాధితుడు ఎంత మొరపెట్టుకున్నా కనికరం చూపలేదు. పైగా బూతులతో మరింత రెచ్చిపోయారు. మరోవైపు మూత్రం పోస్తున్న ఓ వ్యక్తి ఏకంగా తన మర్మాంగాన్ని బాధితుడి నోట్లోకి చొప్పించే ప్రయత్నం చేశాడు.
వీరిద్దరిపై 50కిపైగా కేసులు నమోదు
దాదాపు నెలరోజుల కిందట జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్ అయ్యాయి. అసలేం జరిగిందంటే : ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి, నవీన్ జులాయిగా తిరుగుతుంటారు. వీరిద్దరిపై 50కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇళ్లలో దొంగతనాలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. ఈ క్రమంలో నవీన్ పలుమార్లు జైలుకెళ్లి వచ్చాడు. అంజి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరికి పడటం లేదు. ఈ నేపథ్యంలో మద్యం తాగుదామని నవీన్‌ను ఒంగోలు కిమ్స్ వైద్యశాల వెనుక వైపునకు అంజి రప్పించాడు. అక్కడికి వెళ్లేసరికి అంజితో పాటు మరో 9 మంది యువకులు ఉన్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి బాగా మద్యం సేవించారు.
పరారీలో ప్రధాన నిందితుడు అంజి
ఈ సందర్భంగా పలు పాత వివాదాలను అంజి తిరగదోడాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్ఘణ వాతావరణానికి దారితీసింది. ఇదే అదనుగా సదరు 9 మంది వ్యక్తులు నవీన్‌పై మూకుమ్మడి దాడికి దిగారు. దాడిని తట్టుకోలేని నవీన్ తనను విడిచిపెట్టాలని ఎంత బతిమిలాడినా నిందితులు కర్కశంగా ప్రవర్తించారు. రక్తం కళ్ల జూశారు. ఈ దారుణాన్ని నిందితుల్లోని కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. అయితే నెల తర్వాత నిందితుల్లో కొందరు సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన కారణంగా విషయం కాస్తా వైరల్ అయ్యి పోలీస్ ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అంజి పరారీలో ఉన్నాడని, గాలింపులు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు.