TSRTC: ఈనెల 13 నుంచి 24 వరకు స్పెషల్ బస్సులు - బతుకమ్మ,దసరాకు ప్రత్యేక ఏర్పాట్లు
టీఎస్ఆర్టీసీ పండగ స్పెషల్ బస్సులను నడిపిస్తామని ప్రకటించింది. బతుకమ్మ, దసరా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తామని పేర్కొంది. పండుగల వేళ తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఈనెల 13 నుంచి 24 వరకు 5,265 స్పెషల్ బస్సులు నడిపిస్తామని వివరించింది. ఈ మేరకు బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణాశాఖ అధికారులతో సమన్వయ భేటీ నిర్వహించారు. ఈనెల 20 నుంచి 23 వరకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని, ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను రెఢీ చేస్తామని సజ్జనార్ తెలిపారు. గతేడాది దసరాకు 4 వేల 280 ప్రత్యేక బస్సులను నడిపించిన టీఎస్‌ఆర్టీసీ ఈసారి వెయ్యి బస్సులు అదనంగా నడుపుతోంది.
536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్
5,265 స్పెషల్ బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించామని సజ్జనార్ పేర్కొన్నారు. దసరా, బతుకమ్మ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలేమీ ఉండబోవన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు దసరా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. హైదరాబాద్ MGBS, JBS, CBS బస్టాండ్లు సహా KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ నుంచి ప్రత్యేక బస్సులు నడిస్తామన్నారు. పండుగ రోజుల్లో MGBS-UPPAL, MGBS-JBS, MGBS-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకు ఓ సిటీ బస్సును సిద్ధం చేశామన్నారు. సమయం వృథా కాకుండా గమ్యం ట్రాకింగ్ యాప్‌ను వినియోగించుకోవాలన్నారు. టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను మరింత సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు.