
Boeing: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రమాదం.. బోయింగ్ ఇంధన స్విచ్‌లపై ముందే హెచ్చరించిన యూకే!
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి విడుదలైన ప్రాథమిక నివేదికలో, ప్రమాదానికి ప్రధాన కారణంగా ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడాన్ని స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్‌లపై అనుమానాలు తలెత్తాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన పౌర విమానయాన సంస్థ (CAA) కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదానికి నలుగు వారాల ముందే బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్‌లపై హెచ్చరికలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది.
వివరాలు
విమానాల్లో ఫ్యూయెల్ షట్‌ఆఫ్ వాల్వ్‌లను ప్రతిరోజూ పరిశీలించాలి: FAA
787 డ్రీమ్‌లైనర్‌తో పాటు ఐదు రకాల బోయింగ్ విమానాల్లో ఉపయోగిస్తున్న ఇంధన స్విచ్‌లపై, భద్రతా పరంగా మే 15న నోటీసు జారీ చేసినట్లు సీఏఏ వెల్లడించింది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) చేపట్టిన ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్ (AD)లో ఈ స్విచ్‌లలోని ఇంజిన్ ఫ్యూయెల్ షట్‌ఆఫ్ వాల్వ్ యాక్టువేటర్లలో లోపాలున్నట్లు గుర్తించడంతో, వాటిపై హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది. ఇందువల్ల ఆయా విమానాల్లో ఫ్యూయెల్ షట్‌ఆఫ్ వాల్వ్‌లను ప్రతిరోజూ పరిశీలించాల్సిందిగా FAA ఆదేశించినట్లు తెలియజేసింది. ఇక అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు జూన్ 12న బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
వివరాలు
నివేదికలను DGCAకి సమర్పించాలి
రెండు ఇంజిన్లకు తక్కువ సమయంలోనే ఇంధన సరఫరా ఆగిపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్‌లపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మరోవైపు, ఈ ఇంధన స్విచ్‌లపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దేశీయ ఎయిర్‌లైన్స్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ వద్ద ఉన్న బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థలను పర్యవేక్షించాలని సూచించింది. తనిఖీల అనంతరం సంబంధిత నివేదికలను DGCAకి సమర్పించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.