LOADING...
Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సమావేశం.. డీకే.శివకుమార్ దూరం!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సమావేశం.. డీకే.శివకుమార్ దూరం!

Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం.. ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య సమావేశం.. డీకే.శివకుమార్ దూరం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా రాజకీయం బాగా వేడెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరపనున్నారు. అయితే, ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరుకావడం లేదన్న విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీఎం సిద్ధరామయ్య అభివృద్ధి పనుల కోసం ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిధుల కేటాయింపు,అమలుపై చర్చించేందుకే ఆయన ఎమ్మెల్యేలతో విధానసౌధలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

వివరాలు 

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డీకే శివకుమార్

అయితే ఈ సమావేశానికి డీకే శివకుమార్ దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని కాంగ్రెస్ వర్గాలు ఈ విషయాన్ని ఆందోళనగా భావిస్తున్నాయని సమాచారం. అయితే శివకుమార్ ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉండటం కొత్త విషయం కాదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత పదవీకాలంలో కూడా ఆయన పలు ముఖ్యమైన భేటీలకు హాజరుకాలేదని గుర్తు చేశాయి. ఇక మరోవైపు, డీకే శివకుమార్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందుకే ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారని మరికొందరు నేతలు వివరణ ఇచ్చారు. అయితే సాధారణంగా ఎమ్మెల్యేల సమావేశాలు కేపీసీసీ కార్యాలయంలో నిర్వహిస్తారు. కానీ ఈసారి సీఎంలు విధానసౌధలోని తన అధికారిక ఛాంబర్‌లో సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.

వివరాలు 

డీకే శివకుమార్‌ను  పక్కన పెట్టాలనే కుట్ర

దీని వెనక దాగిన ఉద్దేశం ఏంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో చురుగ్గా సాగుతోంది. డీకే శివకుమార్‌ను దీని ద్వారా పక్కన పెట్టాలనే కుట్రేనా అని ఆయన మద్దతుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా డీకే శివకుమార్ మాత్రం తన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. కొద్దిరోజులుగా కర్ణాటక రాజకీయాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతోంది.

వివరాలు 

ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా నేనే కొనసాగుతా: సిద్ధరామయ్య

కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని నమ్ముతూ బహిరంగంగా ప్రకటనలు కూడా చేశారు. దీనితో రాజకీయాల్లో కొత్త దుమారం రేగింది. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఉన్నత నేతలు ఈ ప్రచారాలను తోసిపుచ్చారు. సీఎం సిద్ధరామయ్య ఈ విషయంపై స్పందిస్తూ.. తాను పూర్తిగా ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు. దీనికితోడు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తాను సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ అభిప్రాయంలో తప్పేం లేదని వ్యాఖ్యానించారు.