తెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు
రాబోయే మూడు రోజులు ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఏడు రోజులు రాష్ట్రమంతా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మహానగరంతో పాటు జిల్లాలు నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం, మహబూ బాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా ఆయా జిల్లాల్లో చల్లటి వాతావరణం నెలకొంది.
రానున్న 7 రోజుల్లో వడగాలులు వీచే అవకాశం
భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేట, వికారాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రానున్న 7 రోజుల్లో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 45.5 డిగ్రీలు నమోదు కాగా, పెద్దపల్లి జిల్లాలో 45.1 డిగ్రీ, మహబూబాబాద్ జిల్లాలో 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని తెలిపింది.,