Page Loader
AP TG Weather Updates : ఏపీకి మరో ముప్పు - నవంబర్ 26న ముంచుకొస్తున్న అల్పపీడనం
ఏపీకి మరో ముప్పు - నవంబర్ 26న ముంచుకొస్తున్న అల్పపీడనం

AP TG Weather Updates : ఏపీకి మరో ముప్పు - నవంబర్ 26న ముంచుకొస్తున్న అల్పపీడనం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ మరోసారి అలర్ట్ జారీ చేసింది. రేపు దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఈ ఆవర్తనం నవంబర్ 23నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారవచ్చని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఐఎండీ ప్రకారం, నవంబర్ 21న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారవచ్చని అంచనా వేసింది.

వివరాలు 

వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు 

తదుపరి రెండు రోజుల్లో ఇది మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు, రేపు,ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే, నవంబర్ 26 నాటికి అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణ విషయంలో, నవంబర్ 26వరకు పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి హెచ్చరికలు లేవని, అయితే వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.