
Kanwar Route: 'కన్స్యూమర్ ఇస్ కింగ్': కన్వర్ యాత్ర మార్గంలో క్యూఆర్ కోడ్ నిబంధనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు స్పష్టం చేసిన మేరకు కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దాబాలు, రెస్టారెంట్లు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందేనని పేర్కొంది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ''ప్రస్తుత దశలో హోటల్ యజమానులు తప్పకుండా తమ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను చట్టబద్ధంగా ప్రదర్శించాలి. మేము ఈ దశలో ఇతర అంశాలపై స్పందించడంలేదు. ఈ పిటిషన్‌ను ఇక్కడితో ముగిస్తున్నాం'' అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నట్టు ఏఎన్ఐ నివేదిక వెల్లడించింది.
వివరాలు
QR కోడ్ ద్వారా యజమానుల వ్యక్తిగత వివరాలు
కన్వర్ యాత్ర జరుగుతున్న మార్గాల్లో దాబాలు, రెస్టారెంట్ల యజమానుల వివరాలు పొందుపరిచిన QR కోడ్ ప్రదర్శన తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతుండగానే.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఇదే విధమైన ఆదేశాలను అమలులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ నిబంధనల వల్ల పౌరుల మౌలిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపిస్తూ అకడమిక్ అపూర్వానంద్ జ్హా తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ''QR కోడ్ ద్వారా యజమానుల వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతాయి. ఇది మతపరమైన వివక్షకు దారితీస్తుంది'' అని వారు తమ వాదనలో పేర్కొన్నారు.
వివరాలు
మైనారిటీ వర్గాల వారి మౌలిక హక్కులకు తీవ్రంగా భంగం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం హోటళ్లకు లైసెన్స్ ఉండటం మాత్రమే తప్పనిసరి అనీ, యజమానుల మతపరమైన గుర్తింపును బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఈ విధానం మైనారిటీ వర్గాలకు చెందిన వ్యాపారులపై మతపరమైన దాడులను ప్రోత్సహించే ప్రమాదం ఉందని, వారి మౌలిక హక్కులకు తీవ్రంగా భంగం కలుగుతుందని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం సాధారణ లైసెన్సింగ్ నిబంధనలకే పరిమితమవాలని, అనవసరమైన QR కోడ్ నిబంధనలను రద్దు చేయాలని కోర్టును కోరారు.
వివరాలు
యాత్ర సమయంలో భద్రతా పరంగా చర్యలు
ఇక గతేడాది యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు లైసెన్స్ ప్రదర్శనపై జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ''రెస్టారెంట్లు, దాబాలు వారు ఏ రకమైన ఆహారం విక్రయిస్తున్నారో మాత్రమే తెలిపే విధంగా ప్రకటనలు చేయాలి. యజమానులు లేదా సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను బలవంతంగా బహిర్గతం చేయకూడదు'' అని న్యాయస్థానం ఆదేశించింది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాత్రం ఈ ఉత్తర్వులను సమర్థించుకుంది. యాత్ర సమయంలో భద్రతా పరంగా చర్యలు తీసుకోవడంకోసం మాత్రమే ఈ నిబంధనలు తీసుకొచ్చామని వివరణ ఇచ్చింది.