US Consulate in Bengaluru : బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే యూఎస్ కాన్సులేట్ ప్రారంభం
బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్! 2025 జనవరిలో నగరంలో యూఎస్ కాన్సులేట్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీఎంపీ తేజస్వి సూర్య వెల్లడించారు. అదే విషయాన్ని భారతంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా ధ్రువీకరించారు.
2020లోనే ఈ అంశం గురించి అమెరికా అధికారులతో చర్చించాను: తేజస్వి సూర్య
"బెంగళూరులో ఉన్న ప్రజలకి బిగ్ అప్డేట్! నగరంలో యూఎస్ కాన్సులేట్ ప్రారంభించడానికి జనవరిలో తేదీ నిర్ణయించబడింది.భారతదేశ ఐటీ నగరంగా,దేశ ఐటీ రెవెన్యూలో 40 శాతం వాటా కలిగి ఉన్న బెంగళూరు,ఇప్పటివరకు యూఎస్ కాన్సులేట్ లేకుండా ఉంది.దీంతో,వీసా కోసం స్థానికులు చెన్నై లేదా హైదరాబాద్ కి వెళ్ళాల్సి వస్తోంది.ఎంపీగా బాధ్యత చేపట్టిన తర్వాత, బెంగళూరులో యూఎస్ కాన్సులేట్ ను నెలకొల్పడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను.2020లోనే ఈ అంశం గురించి అమెరికా అధికారులతో చర్చించాను.2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లి,ఈ విషయంలో కూడా మాట్లాడారు.ఇప్పుడు, ఈ డిమాండ్ పూర్తి అవుతున్న సమయంలో, చాలా సంతోషంగా ఉంది," అని తేజస్వి సూర్య ట్వీట్ చేశారు.
అమెరికా వీసా సంబంధిత పనుల కోసం ఇతర నగరాలకు
బెంగళూరులో అమెరికా వీసా సంబంధిత పనుల కోసం ప్రజలు ఇతర నగరాలకు వెళ్ళాల్సి వస్తోంది. దీని కోసం రూ. 25 వేల నుండి రూ. 30 వేల వరకు ఖర్చు అవుతుంది. బెంగళూరులో ఇంతకాలం కాన్సులేట్ లేకపోవడం ఒక పెద్ద ఇబ్బంది. నగరంలో ముఖ్యంగా విద్యార్థులు, టెక్ రంగం వ్యక్తులు అమెరికా వెళ్లే వారే ఎక్కువ. తేజస్వి సూర్య మాట్లాడుతూ, "కనీసం నాలుగైదు లక్షల మంది బెంగళూరులో యూఎస్ కాన్సులేట్ సహాయం పొందవచ్చు" అన్నారు.
కర్ణాటకలోని నాలుగైదు లక్షల మందికి వీసా సేవలు
"ఈ ప్రకటనపై మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. దీనిని సాధించడానికి నాకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బెంగళూరులోని యూఎస్ కాన్సులేట్ ప్రతీ సంవత్సరం కర్ణాటకలోని నాలుగైదు లక్షల మందికి వీసా సేవలు అందించడానికి సహాయపడుతుంది. ఇక, రాష్ట్రం దాటి ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు," అని తేజస్వి సూర్య చెప్పారు. ఇంకా, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో, గార్సెట్టి మాట్లాడుతూ, "బెంగళూరులో కాన్సులేట్ లేని ఏకైక ప్రధాన దేశం అమెరికా" అని చెప్పారు. ఆయనను ఉద్దేశించి, "ఇప్పటికీ, బెంగళూరులో యూఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయడంపై మరింత దృష్టి సారించాం" అని గార్సెట్టి వెల్లడించారు.
భారతదేశం,అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం
అలాగే, బెంగళూరుతో పాటు, అహ్మదాబాద్ లో కూడా యూఎస్ కాన్సులేట్ లను ప్రారంభించనున్నట్లు గార్సెట్టి తెలిపారు. ఈ నిర్ణయం, భారతదేశం,అమెరికా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన చెప్పారు. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లినప్పుడు, అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో భారత్ లో రెండు కొత్త యూఎస్ కాన్సులేట్లను ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు గార్సెట్టి తెలిపారు.