LOADING...
Indian Migrants: అమెరికా నుంచి అమృత్‌సర్‌ చేరుకున్న అక్రమ వలసదారుల విమానం
అమెరికా నుంచి అమృత్‌సర్‌ చేరుకున్న అక్రమ వలసదారుల విమానం

Indian Migrants: అమెరికా నుంచి అమృత్‌సర్‌ చేరుకున్న అక్రమ వలసదారుల విమానం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంది. కొంతమంది భారతీయులను కూడా తిరిగి పంపింది. ఈ అమలులో, చట్టవ్యతిరేకంగా అమెరికాలో ప్రవేశించిన వారిని ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపారు. 205 మందితో కూడిన ఒక అమెరికా సైనిక విమానం (C-17) టెక్సాస్‌ నుంచి బయలుదేరి, బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్సర్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. ఈ వలసదారులు పంజాబ్‌,దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారగా తెలుస్తోంది. అయితే, వీరిని స్వదేశంలో అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల తర్వాత వీరిని ఎయిర్‌పోర్టు నుంచి విడిపించేలా అధికారులు సూచించారు.

వివరాలు 

17,940 మందిని తిరిగి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ

వీరిని తిరిగి పంపించే ముందు, వారి రికార్డులను పరిశీలించినట్లు దిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. రాబోయే రోజులలో మరిన్ని విమానాలు అమెరికా నుండి భారత్‌కు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా హోంలాండ్‌ అధికారుల ప్రకారం, 20,407 మంది భారతీయులు సరైన పత్రాలు లేకుండా ఉన్నట్లు గుర్తించారు. 17,940 మందిని తిరిగి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ రిమూవల్‌ ఆపరేషన్స్‌ (ఈఆర్‌వో) నిర్బంధంలో ఉన్నారు. తొలివిడతలో 205 మందిని తిరిగి పంపించారు. ట్రంప్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత, అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని మొదలు పెట్టారు.

వివరాలు 

5,000 మంది అక్రమ వలసదారులను మరొక దేశాలకు తరలించేందుకు పెంటగాన్‌ సిద్ధం 

ఈ క్రమంలో, ఎల్‌ పాసో, టెక్సాస్‌, శాన్‌ డియాగో, కాలిఫోర్నియా వంటి ప్రాంతాలలో 5,000 మంది అక్రమ వలసదారులను మరొక దేశాలకు తరలించేందుకు పెంటగాన్‌ సిద్ధమైంది. ఇప్పటికే, కొన్ని వలసదారులను సైనిక విమానాల ద్వారా గటేమాలా, పెరు, హోండూరస్‌ వంటి దేశాలకు తరలించారు. భారతదేశం అమెరికా విధానాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అక్రమ వలసలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామనేది భారత ప్రభుత్వం అభిప్రాయం. ఈ సమస్య అనేక వ్యతిరేక,వ్యవస్థీకృత నేరాలతో సంబంధం ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకపోయినా,అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడాన్ని వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.