
Uttam Kumar Reddy: ఏపీకి 64% ఇచ్చి.. తెలంగాణకు 36%.. కృష్ణా జలాలు, కాళేశ్వరంపై ప్రజంటేషన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణా నదీ జలాల వినియోగం, వాటాల అమలులో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని మించిన దారుణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత దశాబ్దంలోనే చోటు చేసుకుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టకుండా, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం నిర్మాణం కమీషన్ల కోసం చేపట్టి ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఆరోపించారు. ప్రజలకు నిజాలు తెలియజేయడం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బాధ్యతగా పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కృష్ణా జలాల పంపకంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
వివరాలు
జగన్‌తో భేటీ తర్వాతే నీటి మళ్లింపులు పెరిగాయి
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జలవిభాగానికి చెందిన ఎస్‌ఈ చల్లా విజయ్ కుమార్ సహా పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2019, 2020 సంవత్సరాల్లో ప్రగతి భవన్‌లో అప్పటి ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ చేసిన భేటీల తరువాతే ఆ రాష్ట్రం శ్రీశైలంలో 797 అడుగుల నీటిమట్టానికి రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు ప్రకటించిందని తెలిపారు. ఈ సమయంలో జరగాల్సిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ కావాలని హాజరుకాలేదన్నారు.
వివరాలు
మేడిగడ్డ కాంక్రీటు వృథా
ఇదంతా నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడారిగా మారడానికి దారితీసిందన్నారు. ఏపీకి 64 శాతం, తెలంగాణకు కేవలం 36 శాతం జలాలు ఇవ్వాలంటూ ఐదు సార్లు కేసీఆర్ ఒప్పందాలపై సంతకాలు చేయడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా తరలించే సామర్థ్యం 2014 ముందు 44 వేల క్యూసెక్కులు ఉండగా, తరువాత ఏపీ ప్రభుత్వం 92 వేల క్యూసెక్కులకు పెంచిందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.38వేల కోట్లతో ప్రారంభించిన పనులలో తెలంగాణ ఏర్పాటైన సమయానికి రూ.11,690 కోట్ల వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అప్పట్లో కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసినట్టు గుర్తు చేశారు.
వివరాలు
సరైన డిజైన్,నిర్మాణం లేకపోవడం వల్ల మూడు బ్యారేజీలు పనికిరాకుండా పోయాయి
కానీ తుమ్మిడిహెట్టి వద్ద నీరు లేదని అబద్ధంగా ప్రచారం చేసి కమీషన్ల కోసం మేడిగడ్డకు మార్చారని తెలిపారు. 2022 నాటికి ప్రాజెక్టు వ్యయం రూ.1.47 లక్షల కోట్లకు పెరిగిందని కాగ్ నివేదికను ఉటంకించారు. సాగు లక్ష్యం కేవలం పాత ప్రాజెక్టుతో పోల్చితే రెండు లక్షల ఎకరాలే అధికమని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం వడ్డీ, అసలు చెల్లింపుల రూపంలో రూ.16 వేల కోట్లు ఖర్చవుతుందని వివరించారు. సరైన డిజైన్,నిర్మాణం లేకపోవడం వల్ల మూడు బ్యారేజీలు పనికిరాకుండా పోయాయని ఎన్డీఎస్‌ఏ నివేదికలో స్పష్టం చేశారని తెలిపారు. 2019లో ప్రారంభించినప్పటి నుంచే బ్యారేజీల్లో లీకేజీలు మొదలైనప్పటికీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు పట్టించుకోకపోవడం వల్ల అవి చివరకు కుంగిపోయాయని విమర్శించారు.
వివరాలు
కాంగ్రెస్ హయాంలో పెరిగిన నీటి వినియోగం
ఇప్పుడూ హరీశ్ రావు బ్యారేజీల్లో నీళ్లు నింపడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజానికి లోపాలు సరిచేయకుండా నింపితే 44 గ్రామాలు, భద్రాచలం ప్రమాదానికి గురవుతాయని ఎన్డీఎస్‌ఏ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వాడిన నీరు కేవలం 65టీఎంసీలే అని తెలిపారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని పోగొట్టి,తెలంగాణకు నీటి వినియోగాన్నిపెంచినట్టు చూపించడం తప్పుడు ప్రచారమన్నారు. అసలు 2004-2014 మధ్య కాంగ్రెస్ పాలనలో శ్రీశైలం నుంచి 727 టీఎంసీల నీరు ఏపీకి తరలించబడగా,2014-2023 మధ్య బీఆర్ఎస్ హయాంలో అది 1200 టీఎంసీలకు పెరిగిందన్నారు. గత పదేళ్లతో పోల్చితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తరువాతే తెలంగాణ ఎక్కువ నీటిని వినియోగించగలిగిందని(286 టీఎంసీలు)తెలిపారు.
వివరాలు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే అదనంగా 220 టీఎంసీల వినియోగం
కల్వకుర్తి, పాలమూరు, నెట్టెంపాడు, భీమా, డిండి, ఎస్సెల్‌బీసీ వంటి ప్రాజెక్టులు గత పదేళ్లలో పూర్తి చేసి ఉంటే అదనంగా 220 టీఎంసీల నీటిని వినియోగించేవాళ్లమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. కృష్ణా పరీవాహక ప్రాంతం, జనాభా, కరవుపీడిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు 575 టీఎంసీలు, ఏపీకి 235 టీఎంసీల న్యాయమైన వాటా ఇవ్వాలన్నదే తమ వాదన అని తెలిపారు. విచారణ తుదిదశకు చేరిందనీ, తానే స్వయంగా విచారణలకు హాజరవుతున్నానని మంత్రి ఉత్తమ్ తెలిపారు.