UttarPradesh : యూపీలో ఘోరం.. 6నెలల్లో 9మంది మహిళల వరుస హత్య
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గత 6 నెలల్లో 9 మంది మహిళలను వరుసగా హత్య చేసిన తీవ్ర ఘటన యూపీలో కలకలం రేపుతోంది. ఈ మేరకు హంతకుడి కోసం పోలీసులు ముమ్మురంగా గాలిస్తున్నారు. మహిళల్నే టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్న వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి బరేలీలో ఆరు నెలల వ్యవధిలోనే 9 మంది మహిళలు దారుణ హత్యలకు గురయ్యారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా వేటాడిన ఈ నర హంతకుడు మహిళలు కనిపిస్తే తీవ్రంగా విరుచుకుపడేవాడని పోలీసులు అంటున్నారు. ఈ మేరకు మహిళలు, ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరించారు. ఈ హత్యల నేపథ్యంలో యూపీ పోలీసులు పలు ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచారు.
మహిళలు ఓంటరిగా బయటకు వెళ్లకండి : యూపీ పోలీసులు
షాహి,ఫతేగంజ్ వెస్ట్, షీష్‌గఢ్ ప్రాంతాల్లో గత కొన్ని నెలల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. హత్యలకు గురవుతున్న మహిళలందరూ 50-65 ఏళ్ల వయసులో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. మరోవైపు సదరు మహిళలందర్ని గొంతులు కోసి చంపారని, వారి మృతదేహాలు పొలాల్లో కనిపించాయని పోలీసులు పేర్కొన్నారు. హత్యకు ముందు మహిళలపై దోపిడి,అత్యాచారం,లైంగిక వేధింపులు జరగలేదని గుర్తించారు. స్థానికులు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని,లేదంటే ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. హత్యకు గురైన మహిళల్లో 55 ఏళ్ల తన తల్లి పొలానికి వెళ్లి తిరిగి రాలేదని బాధిత కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు చెరుకు తోటలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కిల్లర్ కోసం 8మందితో కూడిన బృందాన్ని ఏర్పరిచారు.