ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు
ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు. దీంతో గతంలో చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందిన 'మాణా' విలేజ్ ఇప్పుడు దేశానికి మొదటి గ్రామంగా మారినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. మాణా గ్రామం చమోలి జిల్లాలోని బద్రీనాథ్ సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం. హిమాలయాల్లో ఉన్న మాణా గ్రామం చైనాతో సరిహద్దును పంచుకుంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని సరిహద్దు ప్రాంతాలు మరింత శక్తివంతంగా మారుతున్నాయని, ఈ లక్ష్యానికి మద్దతుగా "వైబ్రెంట్ విలేజ్" కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.
సముద్ర మట్టానికి 3219 మీటర్ల ఎత్తులో మాణా గ్రామం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన ప్రభుత్వ 'వైబ్రంట్ విలేజ్' పథకంలో భాగంగా 'మాణా'ను తొలి గ్రామంగా ప్రకటించారు. 'వైబ్రంట్ విలేజ్' పథకంలో భాగంగా 19జిల్లాలు, నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 46సరిహద్దు బ్లాకుల్లోని గ్రామాలను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మాణా గ్రామం సముద్ర మట్టానికి 3219 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది సరస్వతి నది ఒడ్డున ఉంది. మాణా గ్రామంలో భోటియాస్ (మంగోల్ తెగ)కు నిలయమని ఉత్తరాఖండ్ టూరిజం వెబ్‌సైట్ చెబుతోంది. మాణా గ్రామాన్ని మే నుంచి నవంబర్ ప్రారంభం వరకు సందర్శించడానికి ఉత్తమ సమయం. ఆ తరువాత నుంచి ఏప్రిల్ వరకు భారీ హిమపాతం కురుస్తుంది.