
JD Vance: భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్.. నాలుగు రోజుల పర్యటన ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన తొలి భారత పర్యటన కోసం దేశానికి చేరుకున్నారు.
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా, ఆయన సోమవారం నాడు దిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు.
ఆయనతో పాటు ఆయన భార్య ఉషా వాన్స్ కూడా ఈ పర్యటనలో భాగమయ్యారు.
ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ముఖాముఖీ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో వాణిజ్యం, సుంకాల విధానం, ప్రాంతీయ భద్రత, ఇతర ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నారు.
వివరాలు
భారత సైనిక బృందం గౌరవ వందనం
జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత భారత్‌కి రావడం ఇదే మొదటిసారి.
ఆయన వెంట ఆయన సతీమణితో పాటు ముగ్గురు పిల్లలు, ఇంకా అమెరికా నుండి వచ్చిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
ఇందులో రక్షణ,విదేశాంగ శాఖలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. భారత్‌కు వచ్చిన వెంటనే వాన్స్ దంపతులకు భారత సైనిక బృందం గౌరవ వందనం ఇచ్చింది.
సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ, దిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఉన్న తన అధికారిక నివాసంలో వాన్స్ దంపతులకు స్వాగతం పలకనున్నారు.
అనంతరం ఇద్దరు నేతల మధ్య అధికారిక చర్చల్లో పాల్గొంటారు.
వివరాలు
వాన్స్ దంపతులు సహా అమెరికా ప్రతినిధుల కోసం ప్రత్యేక విందు
ఈ చర్చల్లో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలు ప్రస్తావనకు వస్తాయి.
రెండు దేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపైనా వారు చర్చించనున్నారు.
భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ, వాన్స్ దంపతులు సహా అమెరికా ప్రతినిధుల కోసం ఒక ప్రత్యేక విందును ఏర్పాటు చేయనున్నారు.
ట్రంప్ టారిఫ్ దూకుడు వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతేకాక, అమెరికా తీసుకుంటున్న గట్టి వలస విధానాలు భారతీయ విద్యార్థులు, వలసదారులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా వాన్స్ చర్చలు జరిపే అవకాశముంది.
వివరాలు
రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జేడీ వాన్స్ ప్రసంగం
విందు అనంతరం, సోమవారం రాత్రే వాన్స్ దంపతులు జయపుర్‌కి ప్రయాణం చేస్తారు.
అక్కడ వారు ప్రముఖ రాంభాగ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం వారు జయపుర్‌లోని ముఖ్య చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు, ఇందులో ప్రసిద్ధ అంబర్ కోట కూడా ఉంది.
అదేరోజు మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జేడీ వాన్స్ ప్రసంగిస్తారు.
ఈ ప్రసంగంలో ట్రంప్ అధ్యక్షతన భారత్-అమెరికా సంబంధాలు ఎలా విస్తరించాయో వివరించనున్నారు.
ఈ సమావేశానికి విదేశీ విధాన నిపుణులు, భారత ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు.
వివరాలు
ఏప్రిల్ 24న తిరుగు ప్రయాణం
అతిథుల కుటుంబం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం ఆగ్రాకు ప్రయాణించి తాజ్ మహల్, భారతీయ కళలను ప్రతిబింబించే శిల్పాగ్రామ్‌ను సందర్శించనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం తరువాత వారు మళ్లీ జయపుర్‌కి తిరిగి వెళ్తారు. చివరగా, ఏప్రిల్ 24వ తేదీన జయపుర్ నుండి బయలుదేరి అమెరికా తిరుగు ప్రయాణం అవుతారు.