
Vasireddy Padma: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన మరో కీలక నేత..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్సార్‌సీపీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా, మరో సీనియర్ మహిళా నేత అయిన మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఆమె ఇవాళ అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనుందని ప్రచారం జరుగుతోంది.
ఈ సందర్భంగా ఆమె వైఎస్సార్‌సీపీని వీడటానికి కారణాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.
వివరాలు
జగ్గయ్య పేట ఇంచార్జ్ పదవి కోసం ఆశ
ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత వాసిరెడ్డి పద్మ ప్రజలకు కనిపించడం లేదు.. ఆమె వైఎస్సార్‌సీపీ కార్యక్రామాలకు దూరంగా ఉంటున్నారు.
వాసిరెడ్డి పద్మ పార్టీని వీడటానికి సంబంధించిన కారణాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
ఎన్నికల సమయంలో ఆమె జగ్గయ్యపేట సీటు కోసం ఆశపడినట్లు తెలుస్తోంది, కానీ ఆ అవకాశాన్ని పొందలేదు.
ఇటీవల, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైఎస్సార్‌సీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఖాళీగా మారింది.
వాసిరెడ్డి పద్మకు జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇంఛార్జ్ పదవి అందుతుందని భావించినా, వై.ఎస్.జగన్ తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వివరాలు
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా
మునుపటి ఎన్నికల క్రమంలో, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆమె జగ్గయ్యపేట టికెట్ కోసం ఆశపడినా, దక్కకపోవడంతోనే రాజీనామా చేసినట్లు అప్పట్లో చర్చ జరిగింది.
అసెంబ్లీ ఎన్నికలలో తనకు లేదా తన భర్తకు టికెట్ కేటాయించాలని ఆమె అధిష్టానానికి వినతులు పంపినట్లు సమాచారం.
అయితే, అధిష్టానం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే, తన పదవికి రాజీనామా చేసినా, సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే తన రాజీనామాకు కారణం కాదని, అయితే కొందరు అలా భావించవచ్చు అన్నారు.
వివరాలు
ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలలోకి..
ఆమె తనకు సీటు వస్తుందా లేదా అనేది ప్రాధాన్యత కాదని, పార్టీ ఆదేశించినా లేదా ఆదేశించకపోయినా తను అన్ని విషయాలకు సిద్ధమని తెలిపారు.
ఇక వాసిరెడ్డి పద్మ రాజకీయాల్లోకి ప్రవేశించడం మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరడం ద్వారా జరిగిందని అందరికీ తెలిసిందే.
2009 ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కొంతకాలం ఆమె సైలెంట్ గా ఉన్నారు.
తరువాత,వైఎస్సార్‌సీపీలో చేరి అధికార ప్రతినిధిగా పనిచేశారు.2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆమెకు జగన్ మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి దక్కింది.
ప్రస్తుతం,ఆమె వైఎస్సార్‌సీపీని వీడటానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.ఆమె ఈ పార్టీని వీడి మరో పార్టీలో చేరతారా లేదా రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్నది చూడాలి.