Telangana: విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ.. ప్రభుత్వానికి డెయిరీ యాజమాన్యం ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) పాల సేకరణ ధరల మార్పును పరిశీలిస్తోంది.
గేదె పాల ధరను లీటరుకు ₹3 పెంచాలని, అయితే ఆవు పాల సేకరణ ధరను ₹2 నుంచి ₹3 వరకు తగ్గించాలని డెయిరీ యాజమాన్యం ప్రతిపాదించింది.
అలాగే, పాల బిల్లులను ప్రతి నెలా 5వ, 20వ తేదీల్లో చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
ప్రస్తుతం డెయిరీకి ₹50 కోట్ల బకాయిలు ఉండటంతో, వాటిని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ విషయమై నిర్వహించిన పాడి రైతుల సమావేశంలో మూడు కీలక ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి, ఇవి ప్రభుత్వ అనుమతికి పంపబడ్డాయి. అనుమతి లభించిన వెంటనే అమలు చేసే అవకాశముంది.
వివరాలు
'విజయ'బ్రాండ్‌ను ఉపయోగించి కొన్ని డెయిరీలు విక్రయాలు
గత ఏడాది నుండి దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి పెరగడం,కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు పాలు సరఫరా అవ్వడంతో మార్కెట్‌పై ప్రభావం పడింది.
ప్రైవేట్,సహకార డెయిరీలు ఈ రాష్ట్రాల నుండి లీటరుకు ₹27 నుంచి ₹32 మధ్య పాలను సేకరించి, అధిక మార్కెటింగ్ కమిషన్లు అందిస్తూ తెలంగాణ మార్కెట్లో విక్రయాలను పెంచుకుంటున్నాయి.
అదనంగా,'విజయ'బ్రాండ్‌ను అక్రమంగా ఉపయోగించి కొన్ని డెయిరీలు విక్రయాలు సాగిస్తున్నాయి.
ఈ పరిణామాల వల్ల విజయ డెయిరీ అమ్మకాలు తగ్గాయి,తద్వారా ప్రతి నెలా సంస్థ దాదాపు ₹12కోట్లు నష్టపోతోంది.
ఫలితంగా,రైతులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది.ఈనేపథ్యంలో,డెయిరీ యాజమాన్యం రైతు ప్రతినిధులతో భేటీ అయ్యి, ధరల సవరణ, బిల్లుల చెల్లింపులు, బకాయిల గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
వివరాలు
ధరల మార్పు వివరాలు:
ప్రస్తుతం గేదె పాల సేకరణ ధర లీటరుకు ₹48 ఉండగా, దీనిని ₹51కి పెంచాలని నిర్ణయించింది.
ఆవు పాల సేకరణ ధరను ప్రైవేట్, సహకార డెయిరీలతో పోల్చితే విజయ డెయిరీ లీటరుకు ₹8-9 అధికంగా చెల్లిస్తోంది.
పాల ఉత్పత్తి, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈ ధరలను సవరించాలని నిర్ణయించినా, ఇతర ప్రైవేట్ డెయిరీల కంటే ఎక్కువే ఉంటుందని స్పష్టం చేసింది.