Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, కర్ణాటక ఎన్నికల హామీలపై తనను విమర్శించిన మోదీకి కౌంటర్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ప్రజలను మోసం చేస్తోందని, ఎన్డీఏ ఇటీవల ప్రకటించిన 100 రోజుల ప్రణాళికను "చవకైన పీఆర్ స్టంట్"గా ఖర్గే అభివర్ణించారు. కర్ణాటకలో ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఖర్గే స్పందించారు. ఖర్గే ట్విటర్‌లో 'మీ 100 రోజుల ప్రణాళిక చవకైన పీఆర్ చర్య మాత్రమే అని, మే 16, 2024న మీరు 2047 కోసం 20 లక్షల మంది సలహాలు తీసుకున్నామని చెప్పారు.
బీజేపీపై నిప్పులు చెరిగిన ఖర్గే
ఆర్‌టీఐ ద్వారా సమాచారం కోరితే పీఎంఓ వివరాలు అందించలేదని, మీ అబద్ధాలు బయటపడ్డాయ అని ఆయన ట్వీట్ వేదికగా ప్రశ్నించారు. బీజేపీపై నిప్పులు చెరిగిన ఖర్గే, బీజేపీ పేరులో బి అంటే బెట్రయల్ (మోసం), జే అంటే జుమ్లా (ఖాళీ హామీలు) అని సెటైర్ వేశారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఏడుసార్లు హామీలను వెనక్కి తీసుకున్నట్లు ఖర్గే ఆరోపించారు. అచ్చేదిన్ (మంచి రోజులు), ప్రతేడాది రెండు కోట్ల ఉద్యోగాలు, వికసిత్ భారత్ వంటి హామీలను సరిగా నెరవేర్చలేదని ఖర్గే అన్నారు.
కర్ణాటక హామీలపై మోదీ ఘాటు విమర్శలు
కర్ణాటక హామీలపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శుక్రవారం కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఖర్గే తమ రాష్ట్ర నాయకత్వానికి ఆర్థికంగా సాధ్యమైన హామీలనే ఇవ్వాలని సూచించిన నేపథ్యంలో, మోదీ "కాంగ్రెస్ పార్టీకి అవాస్తవ హామీలిచ్చే అలవాటు ఉందని, వాటిని అమలు చేయడం అసాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలిస్తూనే ఉంటుందని, కానీ ఆ హామీలు నెరవేర్చగలమనే నమ్మకం వారికి ఉండదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి తగ్గుతోందని, ఆర్థిక పరిస్థితి కూడా క్షీణిస్తోందని మోదీ ఆరోపించారు.