
Himayatsagar: నిండు కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి మూసీలోకి నీటి విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షాల తాకిడికి నగరం పూర్తిగా అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు నీటితో నిండిపోవడంతో నదులను తలపించేలా మారాయి. వర్షపు నీటిలో వాహనదారులు అనేక చోట్ల చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా, శివారులోని హిమాయత్‌సాగర్ జలాశయం వరద ప్రవాహంతో నిండుకుండలా మారింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరడంతో అధికారులు ఒక గేటును ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. హిమాయత్‌సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం అది 1762.70 అడుగుల వద్ద నమోదైంది. ఈ జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.73 టీఎంసీల నీరు ఉంది.
వివరాలు
యాదాద్రి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 15.4 సెం.మీ వర్షం
ప్రస్తుతం జలాశయంలోకి సెకనుకు వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్‌ఫ్లో సెకనుకు 339 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. నీటిమట్టం పెరిగిన నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షపాతం వివరాలు చూస్తే - గురువారం రాత్రి 11 గంటల వరకు యాదాద్రి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 15.4 సెం.మీ వర్షం నమోదైంది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14.1 సెం.మీ, శేరిలింగంపల్లి పరిధిలోని ఖాజాగూడలో 13.3 సెం.మీ వర్షం కురిసింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరిన్ని నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని కూడా తెలిపింది.