
SC Sub Classification: ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం: చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ (SC Sub Classification) కు కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పామని, ఇప్పుడు కూడా అదే మాట నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన, "అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పాను. జిల్లాల వారీగా కేటగీరీ విభజన చేయాల్సి ఉంటుంది. జనగణన తర్వాత మరొకసారి జిల్లాల వారీగా విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు.
వివరాలు
ఎస్సీ వర్గీకరణపై గత చరిత్ర
1996లో ఏబీసీడీ కేటగీరీ విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రేషనలైజేషన్, కేటగీరీలపై 2000లో చట్టం తీసుకువచ్చారని, అయితే ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసిందని తెలిపారు.
ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ద్వారా ఎస్సీ వర్గీకరణ అవసరం అనే విషయాన్ని నిష్కర్షకు తీసుకువచ్చిందని చెప్పారు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసిందని, ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగిందని వివరించారు.
"ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుతూ మొదటి కమిటీ ఏర్పాటుపరిచినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు ఈ ప్రయాణంలో ఉండటం నా అదృష్టం" అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఎన్.టి.ఆర్. సామాజిక న్యాయం కోసం చేసిన కృషి
సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్.) అని చంద్రబాబు గుర్తు చేశారు.
పేదల కోసం శాశ్వత గృహనివాస పథకం తీసుకువచ్చిన తొలి నేత ఎన్.టి.ఆర్. అని కొనియాడారు.
ఎస్సీలపై వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
"అంటరానితనం నిషేధానికి జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను నేనే వేశాను. అంటరానితనం రూపుమాపడానికి అనేక జీవోలు జారీ చేశాం. ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం" అని చంద్రబాబు తెలిపారు.
హోటళ్లు, మంచినీటి బావుల వద్ద ఎస్సీలకు వివక్ష చూపకుండా చట్టపరంగా చర్యలు తీసుకున్నామని, సాంఘిక సమానత్వంపై అవగాహన సదస్సులు నిర్వహించామని వివరించారు.
వివరాలు
దళితుల ఆత్మగౌరవానికి తెలుగుదేశం పార్టీ చేసిన కృషి
"లోక్‌సభ స్పీకర్‌గా దళితుడిని చేసిన పార్టీ తెలుగుదేశం" అని చంద్రబాబు గుర్తు చేశారు.
బాలయోగిని స్పీకర్‌గా ఎంపిక చేయడం,దళిత మహిళ ప్రతిభా భారతిని స్పీకర్‌గా చేయడం తెలుగుదేశం ప్రభుత్వ ఘనత అని వివరించారు.
ఎస్సీ అయిన కాకి మాధవరావును రాష్ట్ర సీఎస్‌గా (చీఫ్ సెక్రటరీ) చేసిన ఘనత కూడా తెలుగుదేశానిదే అని తెలిపారు.
యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు,ఎస్సీ అయిన కేఆర్ నారాయణన్‌ను భారత రాష్ట్రపతిగా చేసిన ఘనత తనదే అని చంద్రబాబు గుర్తు చేశారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఎస్సీ,ఎస్టీలకు కీలక పదవులు ఇచ్చిందని వివరించారు.
గతంలో ఎస్సీ అయిన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా, ఇప్పుడు ఎస్టీ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేయడం దీనికి ఉదాహరణ అని తెలిపారు.
వివరాలు
ఎస్సీ సంక్షేమం కోసం చేపట్టిన ఆర్థిక సహాయ పథకాలు
ఎస్సీల అభివృద్ధి కోసం రూ.8,400 కోట్లతో ఆర్థిక సహాయ పథకాలు తీసుకువచ్చామని తెలిపారు.
గతంలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించామని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామనీ వివరించారు.
"నా రాజకీయ జీవితమంతా పేదలకు న్యాయం చేసేందుకే కృషి చేశాను" అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా పవన్ కల్యాణ్ సహకారం అందించారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అన్నారు.
వివరాలు
పీ4 విధానం - పేదలకు మద్దతుగా కొత్త ఆలోచన
"రాష్ట్రంలో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు పీపీపీ విధానం తీసుకువచ్చాను. ఇప్పుడు కొత్తగా ఈ నెలలో పీ4 విధానం తీసుకురానున్నాం" అని చంద్రబాబు తెలిపారు.
సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన వారు, వెనుకబడిన వర్గాలకు తోడ్పాటునందించాలన్న ఉద్దేశంతో ఈ పథకం రూపొందిస్తున్నాం అని చెప్పారు.
"పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తాం" అని చంద్రబాబు వివరించారు.