
Supreme court: ఓటర్ల తొలగింపులపై సుప్రీంకోర్టు సీరియస్..ఆలా చేస్తే మా జోక్యం తప్పదు!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ,ఓటరు జాబితాలో జరిగే ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో, ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు అవసరమైన ఆధార్, ఓటర్ ఐడీ కార్డులు వంటి పత్రాలను అనుబంధించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో,ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా, ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) విషయంలో ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉన్నాయని, అది చట్ట పరిధిలోనే పని చేస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఓటర్లను భారీగా తొలగించే పరిణామాలు చోటు చేసుకుంటే, ఆ సమయంలో తాము తప్పక జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది.
వివరాలు
ఆగస్టు 8 లోగా పిటిషనర్ల అభిప్రాయాలు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశం
ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 12, 13 తేదీల్లో మళ్లీ విచారిస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే,ఆగస్టు 1న విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాలో అనేకమంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీని వల్ల వారు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం,ఓటర్ల జాబితాల్లో ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు ఉంటే, సంబంధిత ఆధారాలతో సహా వాటిని కోర్టు దృష్టికి తీసుకురావాలని సూచించింది. తాము భయపడుతున్నట్లుగా ఎలాంటి పరిస్థితి ఏర్పడినా వెంటనే జోక్యం చేసుకుంటామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. పిటిషనర్ల అభిప్రాయాలు,ఆధారాలపై పూర్తి లిఖితపూర్వక సమర్పణలను ఆగస్టు 8 లోగా దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
వివరాలు
ఈ దశలో స్టే ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసిన ధర్మాసనం
ఇక, త్వరలో బిహార్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, ఓటర్ల సంతకాలను నకిలీగా తయారుచేసి, వారి అనుమతి లేకుండానే ఆన్‌లైన్‌లో సమర్పించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో, బిహార్‌లో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణపై తాత్కాలిక ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టులో దరఖాస్తు చేశారు. అయితే, ప్రస్తుతం ఈ దశలో స్టే ఆదేశాలు జారీ చేయలేమని సోమవారం ధర్మాసనం స్పష్టంచేసింది.