Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై చల్లని వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గాలిలో తేమ శాతం 91 శాతానికి చేరుకుంది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల వరకు ఉండవచ్చని అంచనా.
వివరాలు
వాతావరణంలో మార్పులు
మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
సాయంత్రం వరకు తేలికపాటి వర్షం లేదా చిరుజల్లులు కురిసే సూచనలు ఉన్నాయి.
వర్షం పడే అవకాశం 55 శాతంగా అంచనా వేశారు. తూర్పు దిశ నుంచి గంటకు 4 నుంచి 7 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
సాయంత్రం వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వివరాలు
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండనుంది.
గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడవచ్చని తెలిపింది. పగటిపూట గాలిలో తేమ శాతం 75 వరకు ఉండనుంది.
తూర్పు, ఈశాన్య దిశల నుంచి స్వల్ప వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.
ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు వర్షాలు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
వర్షాలు కురిసే అవకాశాలు 65 శాతంగా అంచనా వేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హెచ్చరించారు.
తీర ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వివరాలు
రైతులు అప్రమత్తంగా ఉండాలి
అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా వరి కోతలు పూర్తి చేసిన రైతులు, కల్లాల్లో ధాన్యం ఆరబోసిన వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వర్షం కారణంగా ధాన్యం తడిసి నష్టపోకుండా ముందుగానే టార్పాలిన్ పట్టలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
అవసరమైన సమయంలో ధాన్యాన్ని కప్పి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.