LOADING...
Weather update: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు
హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు

Weather update: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక .. రానున్న రెండు రోజులు వడగాల్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2025
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర వ్యాప్తంగా భానుడి సెగలు మరింత పెరగనుంది. వచ్చే మూడు రోజులపాటు సాధారణ ఉష్ణోగ్రతలకు పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండు రోజులు పగలు వేడిగాలులతో తీవ్ర వడగాల్పులు ఉండే అవకాశం ఉందని, అలాగే రాత్రివేళల్లో కూడా గాలి ఉష్ణతా స్థాయిలోనే కొనసాగుతుందని తెలిపింది. బుధవారం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణ స్థాయిని మించిపోయి 3.6 డిగ్రీల మేరకు ఎక్కువగా ఉంది. అదిలాబాద్‌లో 44.3, మెదక్ జిల్లాలో 43.4, రామగుండంలో 42.8, ఖమ్మం జిల్లాలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరించింది.

వివరాలు 

వడదెబ్బతో ఏడుగురు మృత్యువాత 

ఎండలతీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్టా గ్రామానికి చెందిన గంగారాం(55),కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన కళ్లెం రమేష్‌ (54),ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రామనాథం వీధికి చెందిన శేషాచారి(80),పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లైన్ కాలనీకి చెందిన పుల్లూరి రమేష్‌కుమార్‌(37),వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన రవళి(35), హైదరాబాద్‌ చందానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ ఆరో ప్లాట్‌ఫామ్ వద్ద నివసించే ఓ యాచకుడు (70),కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42)వడదెబ్బ కారణంగా మృతిచెందారు.