One Nation One Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ఏమిటి? లాభమా, నష్టమా..వాటి పరిణామాలు ఎలా ఉంటాయి?
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి "ఒకే దేశం, ఒకే ఎన్నిక" అనే ప్రతిపాదన అప్పుడప్పుడు చర్చకు వస్తోంది. దేశంలో ఎన్నికల విధానంలో సమూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంత సులభమైన పని కాదని కేంద్రానికి తెలుసు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి పరిశీలనకు తీసుకువచ్చింది. గతంలో దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగినప్పటికీ, పరిస్థితులు మారిపోవడంతో ఒక్కొక్క రాష్ట్రానికి వివిధ సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి?
జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే. ఈ విధానంలో లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో విభిన్న కాలాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి.
జమిలీ ఎన్నికల సవాళ్లు
జమిలీ ఎన్నికలను అమలు చేయడం సవాళ్లతో కూడుకున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రతిపాదనకు రాజ్యాంగ సవరణలు చేయాలి, లేకపోతే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటం సాధ్యం కాదు. లోక్‌సభలో 543 స్థానాల్లో కనీసం 67% సభ్యులు బిల్లుకు మద్దతు ఇవ్వాలి. అలాగే, రాజ్యసభలో 245 స్థానాల్లో కూడా 67% మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ సవరణలను అమలు చేయాలంటే 14 రాష్ట్రాలు అనుకూలంగా తీర్మానం చేయాలి, అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు పదే.
జమిలీ ఎన్నికల వల్ల ప్రయోజనాలు
ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా,ప్రభుత్వ అధికారులు పరిపాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా మారకుండా ఉంటుంది. జమిలీ ఎన్నికల వల్ల ఇబ్బందులు జమిలీ ఎన్నికల అమలుకు రాజ్యాంగ సవరణలు, చట్ట సవరణలు అవసరం. ప్రాంతీయ పార్టీలు జాతీయ అంశాల ఆధిపత్యం ఉంటుందని, స్థానిక సమస్యలు వెలుగులోకి రాకపోవచ్చని భయపడుతున్నాయి. జాతీయ పార్టీలు అధికంగా ఖర్చు పెట్టగలగడం, ప్రాంతీయ పార్టీలు పోటీ పడలేకపోవడం కూడా వారి ప్రధాన ఆందోళన. గతంలో జమిలీ ఎన్నికలు 1967 వరకు దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగాయి.కానీ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం,1970లో లోక్‌సభ రద్దు కావడంతో ఈ విధానం విరమించబడింది.