
#NewsBytesExplainer: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థుల నిరసనలు, ర్యాలీలు, అరెస్టులతో ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు అంటుండగా, ఆ భూములు ప్రభుత్వానివేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
యూనివర్సిటీ భవనాలను ఆనుకుని ఉండే ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
వివాదం ఎందుకు ప్రారంభమైంది?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2,324 ఎకరాల భూమిని కేటాయించింది.
మొదట అబిడ్స్‌లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో తరగతులు నిర్వహించగా, తరువాత గచ్చిబౌలికి తరలించారు.
ఈ భూములపై వివాదం 2003లో ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రభుత్వం సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలను ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించాలని నిర్ణయించింది.
అయితే 2006లో ప్రభుత్వం ఈ కేటాయింపును రద్దు చేసింది. దీని పై ఐఎంజీ అకాడమీ హైకోర్టులో కేసు వేసింది.
2024 మార్చిలో హైకోర్టు ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా తీర్పు ఇచ్చింది. ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించినా, 2024 మేలో వారి పిటిషన్‌ను కొట్టివేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
వివరాలు
ప్రభుత్వం, యూనివర్సిటీ వాదనలు
టీజీఐఐసీ 2024 జూన్ 24న 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల కోసం అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
ఈ భూములు ప్రభుత్వానివేనని, యూనివర్సిటీ భూములకు ఎలాంటి ముట్టడి జరగలేదని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, యూనివర్సిటీ ఈ వాదనను ఖండించింది. 2024 జులై 19న యూనివర్సిటీ రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహించారని ప్రభుత్వం చెబుతుండగా, యూనివర్సిటీ మాత్రం తాము ఎలాంటి అంగీకారం ఇవ్వలేదని ప్రకటించింది.
పర్యావరణ పరిరక్షణ, బయోడైవర్సిటీకి నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
విద్యార్థుల నిరసనలు
వివాదాస్పద భూమిలో హెలీప్యాడ్స్ ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
విద్యార్థుల ప్రకారం, ఇప్పటికే అడవి కొంత భాగాన్ని చదును చేయగా, రాత్రిళ్లు కూడా పనులు జరుగుతున్నాయి.
స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు డ్రోన్ చిత్రాలు విడుదల చేసి, అక్కడ పెద్ద ఎత్తున పొక్లెయిన్లు పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ నిర్మాణాల వల్ల జీవ వైవిధ్యం నాశనమవుతుందనే భయం వ్యక్తమవుతోంది.
వివరాలు
ప్రభుత్వం స్పందన
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకారం,యూనివర్సిటీ రిజిస్ట్రార్, వీసీ తమ భూములతో సంబంధం లేదని చెప్పారంటూ అసెంబ్లీలో వెల్లడించారు.
కానీ యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 2013లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కమిటీ ప్రకారం, యూనివర్సిటీకి 1,626 ఎకరాల భూమి మాత్రమే ఉందని తేలింది.
యూనివర్సిటీ మిగిలిన భూములను తమ పేరుతో బదలాయించాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు.
గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలకు యూనివర్సిటీ భూముల్లోనే స్థలాలు కేటాయించారని అంటున్నారు.
వివరాలు
భవిష్యత్తు దిశగా
విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరసనలు నిర్వహిస్తున్నారు.
400 ఎకరాలు ఇచ్చిన తర్వాత, మరో 200 లేదా 300 ఎకరాలు ఇలా తీసుకుంటే, యూనివర్సిటీ భూములన్నీ పోతాయనే భయం ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ స్పందించాలని, యూనివర్సిటీ భూములను కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రస్తుతం వివాదం కొనసాగుతుండగా, దీనిపై మరింత స్పష్టత వచ్చే వరకు విద్యార్థుల నిరసనలు కొనసాగుతాయి.